డూడా నిధుల గోల్‌మాల్‌పై
రాయగడ: జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ (డూడా) కార్యాలయంలో ప్రభుత్వ నిధులకు సంబంధించిన రూ.1.09 కోట్ల అవకతవకల వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఔట్‌సొర్సింగ్ ఉద్యోగి గత 41 రోజులుగా పరారీలో ఉన్నప్పటికీ, దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు మొబైల్ ఫొన్ స్విచ్‌ఆఫ్‌లో ఉండగా, పోలీసుల దర్యాప్తు ఏ దశలో ఉందన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు, పోలీసుల పనితీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. డుడా కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన బినయ్ హరిజన్ ప్రభుత్వ ఖాతా నుంచి భారీ మొత్తంలో నిధులను బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత సుమారు రూ.10 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు భావించినప్పటికీ అనతరం మొత్తం రూ.1.09 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు వె లుగులోకి వచ్చింది. ఈ ఘటన జూలై 10 వ తేదీన బయటపడగా ఎనిమిది రోజుల అనంతరం జూలై 18 న డూడ కార్యాలయం తరఫున రాయగడ పో లీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి డూడా కార్యాల యం నుంచి కేసుకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు నమోదై నెలకు పైగా గడుస్తున్నప్పటికీ నిందితుడిని పట్టుకోలేకపోవడం, దర్యాప్తులో పురోగతి కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ వ్యవహారంపై గతంలో రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం ఔట్‌సొర్సింగ్ ఉద్యోగులకు డేటా ఎంట్రీ, కంప్యూటరీకరణ, రికార్డుల నిర్వహణ, ఫైళ్ల నిర్వహణ వంటి సహాయక బాధ్యతలు మాత్రమే అప్పగించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిధుల లావాదేవీలు, ఆర్థిక అనుమతులు, క్యాస్‌బుక్ నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వారికి అప్పగించేందుకు నిబంధనలు లేవని అన్నారు. అయితే గత ఐదేళ్లుగా బినయ్ హరిజన్ చేతిలో ఆన్‌లైన్ బ్యాకింగ్, యూజర్ ఐడి, పాస్‌వర్డ్, క్యాషియర్ వంటి కీలక బాధ్యతలు ఎవరు అప్పగించారు, ఏ అధికారి ఆదేశాలతో ఈ వ్యవస్థ కొనసాగింది, ఇందులో ఎవరైనా ప్రయో జనం పొందారా, అనే అశాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కడ్రక డిమాండ్ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ సత్యకుమార్ నందొ మాట్లాడుతూ ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే రూ.1.09 కోట్ల ప్రభుత్వ నిధుల వ్యవహారంలో నిందితుడు ఇంతకాలం పో లీసులకు చిక్కకుండా ఉండటం, దర్యాప్తులో స్పష్టమైన పురోగతి కనిపించకపోవడంతో కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.


