భువనేశ్వర్: ప్రముఖ ఒడియా నేపథ్య గాయకుడు ప్రణబ్ పట్నాయక్ (88) శుక్రవారం భువనేశ్వర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 5 దశాబ్దాలకు పైగా సాగిన నేపథ్య గానం ప్రస్థానంలో ఒడియా సంగీత పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన గాత్రాలలో ఒకరిగా నిలిచిన ప్రణబ్ పట్నాయక్ మరణం ఒడిశా సినిమా, సంగీత రంగంలో ఒక శకానికి ముగింపు పలికింది. 1938 జనవరి 20న జన్మించిన ప్రణబ్ పట్నాయక్ వృత్తి జీవితాన్ని ప్రారంభించడానికి ముందు గురు కునాల్ ఆదినారాయణ్ వద్ద సంగీతంలో లాంఛనప్రాయమైన శిక్షణ పొందారు. ఆయన 1958లో ’మా’ అనే ఒడియా చిత్రంతో నేపథ్య గాయకుడిగా అరంగేట్రం చేసి అక్షయ మహంతి, శాంతాను మహా పాత్రో, బాలకృష్ణ దాస్, ప్రఫుల్ల కొరొ వంటి ప్రఖ్యాత సంగీత దర్శకులతో కలిసి 200కు పైగా ఒడియా చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఆయన వాణి జయరామ్, హేమలత, ఉషా మంగేష్కర్, భూపిందర్ సింగ్, ఎస్. జానకి, పి.సుశీల, నిర్మల్ మిశ్రా, హైమంతి శుక్లా వంటి ప్రఖ్యాత జాతీయ గాయకులతో కూడా తన గాత్రం పంచుకున్నారు. సినిమా రంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రణబ్ పట్నాయక్ ఒడిస్సీ, జానపద, భక్తి, భజన సంగీతం, సంప్రదాయ గీతాలు, హిందీ గీతాలు మరియు గజల్ ఆలాపనలో చేసిన కృషికి విస్తృతంగా ప్రసంశలు అందుకున్నారు. ఆకాశ వాణి వారి సుగమ్ సంగీత్, భక్తి కార్యక్రమాలతో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుబంధం సంగీత ప్రియుల సుస్థిర ఆదరణకు పునాది వేసింది.
తన విలక్షణమైన గాత్ర శైలికి ప్రసిద్ధి చెందిన ఆయన ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఒడిశా రాష్ట్ర చలన చిత్ర పురస్కారాన్ని 7 సార్లు గెలుచుకున్న ఏకై క ఒడియా నేపథ్య గాయకుడిగా ప్రత్యేక ఘనతను సాధించారు. ఆయన ప్రతిష్టాత్మకమైన జయదేవ్ పురస్కారంతో పాటు, బాలకృష్ణ దాస్ మెమోరియల్ అవార్డు (2023), గంగాధర్ రథ్ మెమోరియల్ అవార్డు (2017), ప్రఫుల్ల కొరొ అవార్డు (2011), బిగ్ ఒడియా ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు (2010), ఒడిశా సంగీత నాటక అకాడమీ అవార్డు (1997–98) వంటి అనేక ఇతర గుర్తింపులు పొందారు.


