భువనేశ్వర్: రాఖీ పూర్ణిమ దగ్గర పడుతున్న తరుణంలో కేంద్రాపడా తులసి క్షేత్రంలో కొలువై ఉన్న రేవతికాంత్ శ్రీబలదేవజీవ్ కోసం రాఖీ యాత్ర సన్నాహాలు ఊపందుకున్నాయి. శ్రీ క్షేత్రం (పూరీ) నుంచి దేవీ సుభద్ర తులసి క్షేత్ర వాసుడు, అన్న రేవతికాంత్ బాలదేవ్ జీవుకు రాఖీ పంపే యాత్ర కార్యక్రమం ఖరారైంది. హై టెక్ గ్రూప్ మేనేజింగ్ ట్రస్టీ, సీఈఓ సురేష్ కుమార్ పాణిగ్రాహి, జగన్నాథ పట్టొసేవా వికాస్ పరిషత్ సీనియర్ సభ్యులు హిమాంశు శేఖర్ సాహు ఈ నెల 23వ తేదీన మద్యాహ్నం 1.30 గంటలకు పూరీ గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి చేతుల మీదుగా పవిత్ర రాఖీని అందుకుని సాయంత్రం 4.15 గంటలకు హై టెక్ మెడికల్ ప్రాంగణంలో గణేష్ మందిరానికి చేరుతారు. రాత్రికి ప్రతాప్ నగర్ లోని ఢాకులై పీఠంలో బస చేసి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సుభద్ర బాడొగ్రహి రామచంద్ర దాస్ మహా పాత్రో, సురేష్ కుమార్ పాణిగ్రాహి ఆధ్వర్యంలో పల్లకిలో ఊరేగింపుగా ఢాకులై పీఠం నుంచి బయల్దేరి కటక్ నువా బజార్ పట్టొ సేవా వికాస్ పరిషత్ ప్రాంగణానికి మధ్యాహ్నం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకి కేంద్రాపడాలో శ్రీ బలదేవజీవ్ గుడిలో అన్నయ్య కోసం పంపిన రాఖీ చేరుతుంది. ఈ రాఖీ యాత్ర నిరవధికంగా 22 ఏళ్లుగా కొనసాగుతోంది. పూరీ నుంచి కేంద్రాపడా వరకు ఈ ఆధ్యాత్మిక యాత్రను లక్షలాది మంది ప్రజలు దర్శిస్తారని హై టెక్ గ్రూప్ అధ్యక్షులు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, సీనియర్ దైతపతి రామచంద్ర దాస్ మహాపాత్రో తెలిపారు.


