రాయగడలో డివిజన్‌ రైల్వే ఆస్పత్రి | - | Sakshi
Sakshi News home page

రాయగడలో డివిజన్‌ రైల్వే ఆస్పత్రి

Aug 18 2026 12:45 AM | Updated on Aug 18 2026 12:45 AM

రాయగడ: రాయగడ రైల్వే డివిజన్‌కి మరో కీలక వైద్య సదుపాయం అందుబాటులోకి రానుంది. రాయగడలో రూ.22.50 కోట్ల అంచనా వ్యయంతో డివిజన్‌ ఆస్పత్రి నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. అలాగే రాయగడ రైల్వే వైద్య యూనిట్‌లో ప్రయోగశాల సేవలు ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యాయి. 24 గంటల అంబులెన్స్‌ సౌకర్యంతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయోగ్నస్టిక్‌ కేంద్రాలతో ఒప్పందాల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయగడ రైల్వే డివిజనల్‌ మేనేజరు అమితాబ్‌ సింఘాల్‌ మాట్లాడుతూ రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పడినప్పటి నుంచి రైళ్ల నిర్వహణ, భద్రత, ఆదాయం, ప్రయాణికుల సేవలు, సరకు రవాణా, మౌళిక వసతుల అభివృధ్ది వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని అన్నారు. రైళ్ల నిర్వహణలో భాగంగా 219 దీర్ఘదూర సరకు రైళ్లను సిద్ధం చేయగా, కిరండొల్‌లో 526 స్టీల్‌ కాయిల్‌ రేకులను తనిఖీ చేసినట్లు తెలిపారు. జూన్‌ 29 న సింగపూర్‌ రోడ్‌–రాయగడ మధ్య అధునాతన సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఆదాయపరంగా కూడా రాయగడ రైల్వే డివిజన్‌ మెరుగైన ఫలితాలు సాధించింది. 2026 జూలైలో రూ.378.87 కోట్ల వాణిజ్య ఆదాయం సమకూరగా అందులో ప్రయాణికుల ఆదాయం రూ.8.53 కోట్లు, సరకు రవాణా ఆదాయం రూ.370.34 కోట్లు లభించాయి. మొత్తం సరుకుల ఆదాయం రూ.1,676.69 కోట్లకు చేరుకుందని తెలిపారు. మౌళిక వసతుల అభివృద్ధిలో భాగంగా కామాలూర్‌–భాంసి మధ్య 12.428 కిలోమీటర్లు, బైగైడ–కక్కిరిగుమ్మ మద్య 12.385 కిలోమీటర్ల రైల్వే మార్గం డబ్లింగ్‌ పనులకు సంబంధించిన నాన్‌ –ఇంటర్‌లాకింగ్‌ పనులు పూర్తి చేశారు. ఇక లెవల్‌ క్రాసింగ్‌ను మూసి వేసి నాలుగు అండర్‌పాస్‌లను అందుబాటులోకి తెచ్చారు. అరకు, జగదల్‌పూర్‌, జైపూర్‌, కక్కిరిగుమ్మ స్టేషన్లలో కొత్త పుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. జిమిడిపేట, లడ్డ, సింగారం స్టేషన్లను దివ్యాంగులకు అనుకూలమైన స్టేషన్లుగా అభివృద్ధి చేశారు. అమృత్‌భారత్‌ స్టేషన్‌ పథకం కింద కొరాపుట్‌, జైపూర్‌, అరకు, జగదల్‌పూర్‌, ధమన్‌జొడి స్టేషన్లలో లిఫ్ట్‌ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement