మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బోడిగేట పంచాయతీ టెక్‌గుఢ గ్రామంలో నివసిస్తున్న దేవ మడకమి (55)పై బుధవారం ఎలుగు దాడి చేసింది. కుడికాలి తొడపై తీవ్ర గాయమైంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. దేవ మడకమి ఆవుల కాపరి. ఆవులను తీసుకుని అడవికి వెళ్లగా పిల్లలతో ఓ ఎలుగు దారిలో కనిపించి ఆయనపై దాడికి తెగబడింది. ఆయన ప్రతిఘటించి గ్రామంలోకి రావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సాయంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
చెరువులో మొసలి పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా బలిమెల అటవీ శాఖ రేంజ్ పరిధిలో గల ఎంవీ 104 గ్రామంలో మహానంద మండల్ అనే వ్యక్తికి చెందిన చెరువులో మొసలి కలకలం రేపింది. ఆ చెరువులో 50 కిలోల చేపలు, వందకుపైగా బాతులను తినేసింది. అటవీ శాఖకు సమాచారం బుధవారం మల్కన్‌గిరి అటవీ శాఖకు చేందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ గ్రామానికి చేరుకుని అతి కష్టం మీద మొసలిని పట్టుకున్నారు. నాలుగు అడుగుల పొడవు ఉన్న ఈ మొసలి వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
44 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు మంగళవారం రాత్రి యం.వి.120 గ్రామం కూడలి వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. రెండు బస్తాల్లో ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తుండగా అనుమానంతో అతన్ని ఆపి తనిఖీ చేయగా గుట్టురట్టయింది. దీంతో అతన్ని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం ఐఐసీ రీగాన్‌కీండో విచారించగా గంజాయిను కలిమెల వైపునకు తరలిస్తున్నట్టు తేలింది. నిందితుడుది కలిమెల సమితి ఎంపీవీ 15 గ్రామానికి చెందిన ఆశుతోష్ బాలాగా గురించారు. అతని నుంచి గంజాయితోపాటు 1030 రూపాయల నగదు, సేల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 44 కిలోలు ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు ఐదు లక్షల రూపాయల వరకూ ఉంటుందని ఐఐసీ రీగాన్‌కీండో తెలిపారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని చెప్పారు.
కొరాపుట్: జయపూర్ పట్టణంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న జగన్నాథసాగర్‌లో గుర్తు తెలియని మహిళ (60) మృతదేహం లభ్యమైంది. బుధవారం సాగర్ వద్ద వెళ్లిన స్థానికులకు నీటిలో మృతదేహం తేలియాడుతూ ఉండటాన్ని గమనించారు. వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వెంటనే అగ్నిమాపక సిబ్బంది రప్పించారు. మృతదేహాన్ని సాగర్ నుంచి వెలికితీశారు. అయితే మృతదేహాన్ని స్థానికులు గుర్తించలేకపోయారు. మహిళ మృతదేహం ఉన్న చోట సుమారు 15 అడుగుల లోతు ఉంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అగ్ని మాపక సిబ్బంది పేర్కొన్నారు.


