ఎనభయ్యో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడానికి దేశం సిద్ధపడుతున్న తరుణాన.. ఆ ఫలాలు తమకెప్పుడు అందుతాయని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి బలిగాం గ్రామ పంచాయతీ మౌలి గుడ, కురికుటి గుడ,రత్నియ గుడ గ్రామాల ప్రజల దుస్థితి ఇది. ఈ గ్రామాల ప్రజలు బయట ప్రపంచానికి రావాలంటే నది దాటాల్సి ఉంటుంది. కానీ వంతెన అంటూ ఏమీ లేకపోవడంతో గిరిజనులే స్వయంగా వెదురు బొంగులతో వంతెన నిర్మించుకున్నారు. ఆ వంతెన మీద ప్రాణాలు ఫణంగా పెట్టి దాటుతున్నారు. మూడు గ్రామాలకు చెందిన 250 కుటుంబాలు ఈ ప్రయాణం చేస్తున్నారు. నదిలో ప్రవాహ ఉద్ధృతి పెరిగితే ఇక బాహ్య ప్రపంచంత సంబంధాలు తెగిపోయినట్టే. దశాబ్దాలుగా అధికారులకు విన్నవిస్తున్నా స్పందించిన వారు లేకపోయారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సేతుబంధు యోజన పథకం ప్రకారం ఇక్కడ వంతెన నిర్మించాల్సి ఉంది. కానీ అమలు కాలేదు. – కొరాపుట్


