భువనేశ్వర్: రాష్ట్రంలో మాజీ శాసన సభ్యుల సంక్షేమం దృష్ట్యా పింఛన్, అనుబంధ భత్యాలు వగైరా ఆర్థిక సౌలభ్యాలు మెరుగుపరచాలని మాజీ శాసన సభ్యుల బృందం అభ్యర్థించింది. ఒడిశా మాజీ ఎమ్మెల్యేల మండలి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని లోక్ సేవా భవన్‌లో బుధవారం కలిసింది. వృద్ధాప్యం కారణంగా పలువురు మాజీ శాసన సభ్యులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వైద్య చికిత్స అవసరం అవుతోంది. చికిత్స కోసం అయ్యే భారీ వైద్య ఖర్చులను భరించలేక ఆర్థిక మాజీ సభ్యులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌లో ధరలు తరచూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కరువు భత్యం (డీఏ), ద్రవ్యోల్బణ ఉపశమన భత్యం (టీఐ) తదితరాలను క్రమం తప్పకుండా పెంచుతున్నాయి. రాష్ట్ర మాజీ శాసన సభ్యులకు మాత్రం ఈ ప్రయోజనం వర్తించడం లేదు. 2017 జనవరి ఆరంభం నుంచి మాజీ శాసన సభ్యులకు ఏకీకృత మొత్తం చెల్లిస్తున్నారు. కావున మాజీ శాసన సభ్యుల ఫించను, ఇతర అనుబంధ ఆర్థిక సౌకర్యాలను పెంచేందుకు ఒడిశా శాసన సభ సలహా కమిటీ చేసిన సిఫారసులను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఒడిశా మాజీ ఎమ్మెల్యేల మండలి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి అభ్యర్థించింది.


