రాయగడ: ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని గుణుపూర్‌లో గల గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల నిర్వహణకు ఎంపికై న ఏకై క విద్యాసంస్థగా జీఐటీటీ విశ్వవిద్యాలయం నిలిచింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన వివిధ రాకెట్ల నమూనాలతోపాటు చంద్రయాన్–3 విజయవంతమైన ప్రయోగం, అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన అంశాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రత్యేక శాస్త్రవేత్త, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి.వి.రమణా రెడ్డి, జీఐఈటీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్రధ్వజ పండా ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని మెగా ఆడిటోరియంలో ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ రమణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో శాస్త్రవేత్తల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు చంద్రధ్వజ పండా మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా ఇస్రో అనేక మైలరాళ్లను సాధించిందని పేర్కొన్నారు. ఉపకులపతి డాక్టర్ గౌతం ఘోష్ ఆధునిక సమాజంలో శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, నూతన ఆలోచనల ప్రాధాన్యతను వివరించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్త దేవాశీస్ మహాపాత్రో స్వాగత ప్రసంగం చేశారు. స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ కె.మురళీగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇస్రోకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు వర్చువల్‌గా పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అంతరిక్ష పరిశోధనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (భౌతిక శాస్త్రం ) ప్రొఫెసర్ ఎ.వి.ఎన్.ఎల్.శర్మ , ప్రొఫెసర్ వైస్ చాన్సలర్ (కంప్యూటర్ సైన్స్) డాక్టర్ బాలకృష్ణ త్రిపాఠి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.జె.రావు తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనను గుణుపూర్ ప్రాంతంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరిచుకుని వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు.


