పర్లాకిమిడి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ ఖేరీలో 2021లో జరిగిన ఘటనపై కేంద్రం చర్యలు చేపట్టాలని, రైతుకూలీ సంఘం, అఖిల భారత కిసాన్ సభ, వామపక్షాలు ఆధ్వర్యంలో జైల్ భరో ఆందోళన సోమవారం పర్లాకిమిడి జిల్లా కేంద్రం కాలేజ్ జంక్షన్ వద్ద నిర్వహించారు. ఈ ఆందోళనలో ఎ.ఐ.కె.యం.యస్.జిల్లా అధ్యక్షులు కేదార్ శోబోరో, ఆదివాసీ మహాసంఘం, రాష్ట్రకమిటీ సభ్యులు దోండపాణి రైయితో, గజపతి జిల్లా రైతుకూలీ రైతు సంఘం కన్వీనర్ రోక్కం లోకనాథం, కార్మికనాయకుడు శ్రీను బెహరా, అఖిలభారత కిసాన్ సభ నాయకులు ముచ్చి బంగారయ్య, అంబేడ్కర్ వీకర్ సెక్షన్ నాయకులు బాలకృష్ణ, అనోమో మందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, రైతులకు వరి, మొక్కజోన్న మద్దతుధర, కార్మికులకు ధరలు పెరుగుదల కారణంగా రోజువారీ కూలీ పెంచాలని, వచ్చే ఎన్నికల్లో ఈ.వి.యం.ఓటింగ్ యంత్రాలు రద్దుచేసి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వాహించాలని వామపక్షనేత దండపాణి రయితో డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా కార్పొరేటర్లకు భూములు ధారాదత్తం చేయడం మానుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.


