భువనేశ్వర్: రాష్ట్రంలో తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకంపై షికారు చేస్తున్న ఊహాగానాల మధ్య ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు సోమవారం డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆఫ్ పోలీస్ హోదాకు పదోన్నతి పొందారు. వారిలో సంజీబ్ పండా మరియు యశ్వంత్ కుమార్ జెట్వా ఉన్నారు. ఈ ఇరువురు అధికారులను అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) హోదా నుంచి డైరెక్టర్ జనరల్ (డీజీ) గ్రేడ్‌కు పదోన్నతి కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆమోదం తెలిపారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ మార్పునకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుత డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా పదవీ కాలం ఈ నెల 16తో ముగియనుంది. తాజా పరిణామంతో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హోదాకు పదోన్నతి కీలకమైన పరిస్థితుల్లో సంజీబ్ పండా, యశ్వంత్ కుమార్ జెట్వా డీజీపీ స్థాయి పదోన్నతికి ఖరారు కావడంతో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి ఆమోదంతో ఈ ఇద్దరు అధికారులు లాంఛనంగా డీజీ గ్రేడ్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా ఆగస్టు 16న పదవీ విరమణ చేసేందుకు ఇప్పటికే అనుమతి మంజూరైంది. 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి అయిన ఆయన పదవీ విరమణకు సంబంధించి హోం శాఖ ఇంతకు ముందే ఒక అధికారిక ప్రకటనను జారీ చేసింది. పదవీ విరమణ తర్వాత ఖురానియా తన పదవీ కాలాన్ని మరింత పొడిగించుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం.
జిల్లాస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ పోటీలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ సైన్స్ ఉన్నత మాధ్యమిక పాఠశాల ఆడిటోరియంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 207 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


