రాయగడలో..
ఘనంగా అంతర్జాతీయ ..
కొరాపుట్:
కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ఆదివారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో చమిరియా గుడ నుండి మజ్జి గూడ జంక్షన్ వరకు వేలాది మంది ఆదివాసీలు ర్యాలీ జరిపారు. అనంతరం బహిరంగ సభ జరిగింది. అటవీ భూముల పై పూర్తి హక్కులు తమకున్నాయని ఆదివాసీ నేతలు నొక్కి చెప్పారు. ప్రభుత్వాలు మారినా ఆదివాసిల జీవితాలు మారలేదని ఆవేధన వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ ఆయుధాలు ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో బీజేపికి నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ బోత్ర, మాజీ ఎంపీ పరశురాం మజ్జి, బీజేడీకి చెందిన డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎంపీలు రమేష్ చంద్ర మజ్జి, ప్రదిప్ మజ్జిలు, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రదాని, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే భుజభల్ మజ్జి పాల్గొన్నారు. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కేంద్రంలో గొండో సమాజ్ నేతృత్వం లో భారీ ర్యాలీ నిర్వహించారు. కొరాపుట్ జిల్లా కేంద్రం లో జరిగిన భారీ ర్యాలీలో జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్, కొట్‌పాడ్ లో జరిగిన ర్యాలీ లో కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపు దర్ బోత్ర, మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ మజ్జిలు పాల్గోన్నారు.జయపూర్ రాజానగర్ నుండి మెయిన్ రోడ్డులో ఆదివాసి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.
మల్కన్‌గిరి : మల్కన్‌గిరిలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా ఆదివాసీ సంఘాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక బస్టాండ్ నుంచి డీఎన్‌కే గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు ఆకర్షించాయి.
పర్లాకిమిడి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని కాశీనగర్ బ్లాక్ పర్తాడ పంచాయతీ యస్.బురడ ఆదివాసీ గ్రామంలో అఖిల భారత ఆదివాసీ మంచ్ (ఏ.ఐ.టి.ఎఫ్.) ఆధ్వర్యంలో శోభాయాత్ర, ఆదివాసీల సభ ఆదివారం జరిగింది. ఏ.ఐ.టి.ఎఫ్ కన్వీనరు కేదార్ శోబోరో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో ఆదివాసీ ప్రజల పరిస్థితిపై ఆయన మాట్లాడారు. రాయగడ జిల్లా సిజ్జిమల్లి నుంచి ప్రారంభమై సుందర్‌ఘడ్ జిల్లా లంజిబెర్నా వరకూ అన్నిటా ఆదివాసీలపై అణచివేతలు, తప్పుడు తీర్పులు, తుపాకీ గొట్టం ద్వారా మంత్రులు, అధికారం అమలుచేస్తున్నారని కేదార్ శోబోరో అన్నారు. ఆదివాసీల జమ్మి, జంగిల్, పర్వతాలు కూడా వదలకుండా త్రవ్వకాలు చేపట్టడం, క్యాపిటలిస్టులకు అటవీ భూలు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధర్మం పేరుతో ఆదివాసీలను విభజన చేస్తున్నారని కేదార్ శోబోరో ఆరోపించారు.
రాయగడ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాయగడలో సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలు, పాటలు మార్మోగాయి. స్థానిక తహసీల్దార్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆదివాసీలు అనంతరం గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన సభా వేదికకు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆధారిత జీవన విధానాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు. ఆదివాసీల భాష, లిపికి రాజ్యాంగపరమైన హక్కులు కల్పించడం లేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అభివృద్ధి పేరుతో సహజ వనరుల దోపిడీ జరుగుతోందని విమర్శించారు. తప్పుడు గ్రామ సభలు నిర్వహించి కంపెనీలకు భూములు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నాయకులు విమర్శించారు. జల్, జంగిల్, జమీన్ హక్కులను దెబ్బ తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, మాజీ ఎమ్మెల్యే మకరంద ముదులి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల, రిటైర్డ్ ఓఏఎస్ అధికారి గొపినాథ్ సరక, సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, రావాల మాఝి, చక్రధర్ బిడిక తదితరులు ఉన్నారు.


