రాష్ట్రంలో ‘ఇంటింటా త్రివర్ణ పతాకం’ ప్రచారం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ‘ఇంటింటా త్రివర్ణ పతాకం’ ప్రచారం ప్రారంభం

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

భువనేశ్వర్‌: క్రాంతి దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ భువనేశ్వర్‌లో చారిత్రాత్మక ‘ఇంటింటా త్రివర్ణ పతాకం’ ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగష్టు 9 నుంచి 17 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పంచాయతీ, నగరం, ఇల్లు, పాఠశాల, కార్యాలయంలో నాలుగున్నర కోట్ల ఒడిశా ప్రజలు జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగురవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన ప్రసంగంలో ఒడిశా స్వాతంత్య్ర సమరయోధులకు, ధైర్యవంతులైన అమరవీరులకు, అమర పుత్రులకు ప్రగాఢ నివాళులర్పించారు. 1942 ఆగస్టు 9న ముంబైలోని ఆగష్టు క్రాంతి మైదాన్‌ నుంచి ప్రారంభమైన ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటానికి కొత్త దిశానిర్దేశం చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. త్రివర్ణ పతాకం కేవలం మూడు రంగుల సముదాయం మాత్రమే కాదు. అది 14 కోట్ల మంది భారతీయుల గర్వానికి, వైభవానికి, ఆకాంక్షలకు ప్రతీక. కేసరి రంగు ధైర్యానికి, త్యాగానికి, తెలుపు రంగు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ రంగు శ్రేయస్సుకు ప్రతీకగా పేర్కొన్నారు. మధ్యలో ఉండే అశోక చక్రం నిరంతర కర్తవ్య పాలన బోధిస్తుందన్నారు. ఈ పవిత్ర జాతీయ పండుగను పూర్తిగా పర్యావరణహితంగా మార్చేందుకు ప్లాస్టిక్‌ జెండాలను పూర్తిగా నిషేధించి కేవలం వస్త్ర జెండాలను మాత్రమే ఉపయోగించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇంటింటా త్రివర్ణ పతాకం ప్రారంభంలో భాగంగా భారీ ఊరేగింపును నిర్వహించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని క్రమబద్ధంగా కవాతు చేశారు. ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంస్కృతిక బృందాలు తమ సంప్రదాయ జానపద నత్యాలు, కళలను ప్రదర్శించాయి. ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులు, వేలాది మంది విద్యార్థులు ‘వందేమాతరం‘, ‘భారత్‌ మాతా కీ జై‘ అనే నినాదాలు చేస్తూ ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌, ప్రభాతి పరిడా, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి, వాణిజ్య, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్‌ జెనా, పాఠశాలలు, సామూహిక విద్య శాఖ మంత్రి నిత్యానంద్‌ గోండ్‌, ఉన్నత విద్య, ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement