రాయగడ: అర్ధరాత్రి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రాయగడ వైపు ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను శేషికాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు, వే బిల్లులు లేకపోవడం గుర్తించిన పోలీసులు లారీలను సీజ్ చేశారు. అయితే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మరో ఇసుక లారీ రోడ్డుపైనే ఇసుకును అన్‌లోడ్ చేసి అక్కడ నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న రెండు లారీలు కాసీపూర్ సమితి పరిధిలోని టికిరి పారిశ్రామిక ప్రాంతం వైపు వెళుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. జిల్లాలోని నాగావళి నది నుంచి ఇసుక తవ్వకాలకు జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధించడంతో కొన్ని పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోని కొమరాడ ప్రాంతంలోని రీచ్‌ల నుంచి ఇసుక కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే నాగావళి నది పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన ఇసుకను కొందరు వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లోని కొమరాడ ప్రాంతంలో నిల్వ ఉంచి వర్షాకాలంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
రైతులను వేధించడం తగదు
కొరాపుట్: రైతులను లేనిపోని నింబంధనలతో వేధించడం తగదని ప్రతిపక్ష బీజేడీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో అన్నారు. ఆదివారం జయపూర్ మెయిన్ రోడ్దులోని లలిత్ మహాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత భూమి కలిగి సుదూర ప్రాంతాలలో ఉన్న రైతులు ఇబ్బందులు పెరిగాయన్నారు. రైతు సంక్షేమ పథకాలు అందాలంటే స్వయంగా భూ యజమానులు స్వస్థలాలకు రావల్సి వస్తుందన్నారు. గతంలో కుటుంబంలో మిగతా సభ్యులకు భూహక్కులు తాత్కాలికంగా లిఖిత పూర్వకంగా ఇచ్చి ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లేవారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అటువంటి వారు కూడా స్వస్థలాలకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలనే కొత్త నిబంధనలు తెచ్చిందని రబినందో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతుకు కేవలం నిబంధనలు మాత్రమే అమలు చేస్తున్నారని.. సంక్షేమ పథకాలను మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. సమావేశంలో బీజేడీ నాయకులు దుర్గా మిశ్ర, బి.బాలంకేశ్వర్ రావు ఉన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి అదృశ్యం
రాయగడ: విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, క్రమశిక్షణకు పెద్ద పీట వేయాల్సిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజుల కిందట కొలనార సమితి రివల్‌కోన ఎస్‌ఎస్‌డీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులపై పదో తరగతి విద్యార్థులు ర్యాగింగ్ చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే డంగసరడ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కునాల్ సబర్ గత వారం రోజులుగా కనిపించకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. డంగసరడ హాస్టల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కునాల్ సబర్ అనే విద్యార్థి గత వారం రోజులుగా కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతని స్వగ్రామం డంగసరడ సమీపంలో గల యుగాపదర్‌గా సమాచారం. తన కొడుకు వారం రోజులుగా కనిపించకపోయినా హాస్టల్ సిబ్బంది తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు డంగసరడ ఉన్నత పాఠశాలకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే విద్యార్థి హాస్టల్‌లో లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినప్పటికీ విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తన కొడుకు ఆచూకీ తెలియజేయాలని హాస్టల్ నిర్వాహకులపై వత్తిడి తీసుకువచ్చారు.


