పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి రాసూరు గ్రామం వద్ద జగన్నాథ నికేతన్ అనాథ ఆశ్రమంలో ‘మహారాజా త్యాగం’ అనే విద్యా కార్యక్రమాన్ని బాలముకుంద కేంద్రం కో ఆర్డినేటరు నిత్యానంద చౌదరి ఆదివారం నిర్వహించారు. అనాథ బాలలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్వాతంత్య్ర సమర యోధులు, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి మహానీయులు దేశం కోసం చేసిన సేవలను బాలలకు తెలియజేశారు. ఆగస్టు 3న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జగద్గుర కృపాలు విశ్వవిద్యాలయాన్ని (జె.కె.యు) ప్రారంభించారన్నారు.
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు
భువనేశ్వర్: ఒడిశా హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వివిధ హైకోర్టులలో న్యాయ మూర్తులను పునర్వవ్యవస్థీకరించే చర్యలో భాగంగా కొలీజియం ఈ సిఫారసు చేసింది. ఈ నెల 6న జరిగిన సమావేశంలో కొలీజియం జస్టిస్ మానష్ రంజన్ పాఠక్, జస్టిస్ కృష్ణ రామ్ మహా పాత్రోల బదిలీని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఒడిశా హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ మానష్ రంజన్ పాఠక్‌ను గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ కృష్ణ రామ్ మహా పాత్రోను ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది.
నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలో చెరువుల ఆక్రమణలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. చెరువుల వద్ద ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఒక వైపు నరసన్నపేటలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గతంలో సహకరించిన అధికారులు, వీఆర్వోలపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా మరో వైపు ఆక్రమణలు పదేపదే జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. మెయిన్ రోడ్డుపై జామియా మసీదు పక్కన ఉన్న పాలకర్ర చెరువు వద్ద గొట్టిపల్లి సర్వే నంబర్ 178/2సీలో ఉన్న స్థలం స్వాధీనానికి స్థానిక హడ్కో కాలనీకి చెందిన ఒకరు మట్టి కప్పారు. ఈ స్థలం పక్కనే ఉన్న ఫీడర్ చానెల్ కూడా కప్పేస్తున్నారు. విలువైన ఈ స్థలంలో పక్కాగా భవనం నిర్మించాలని ప్లాన్ వేసుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నుంచి పలు ట్రాక్టర్లలో మట్టి తరలించారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా దీనిపై తహసీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ పొది లాపు శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా ఈ ఆక్రమణలపై నరసన్నపేట ఎస్‌ఐకు సంబంధిత వీఆర్‌ఓ శ్యామ్ సుందరరావు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు.


