కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని బ్రిటిష్ జైల్‌ని స్వాతంత్య్ర సమర యోధుల స్మారక స్థూపంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబ సభ్యుల సంఘం అధ్యక్షుడు మున్నా త్రిపాఠి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న బ్రిటిష్ జైలు వద్ద క్రాంతి దివాస్ వేడుకలలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 1942లో ఇదే రోజు మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్రాంతి ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇదే జైలులో అనేక మంది స్వాతంత్య్ర సమర యోధులు కన్ను మూశారని పేర్కొన్నారు. జైలుతో పాటు పపడాహండిలో సాయుధ స్థూపాన్ని కూడా ప్రభుత్వం స్మారక స్థూపంగా అభివృద్ధి చేయాలని మున్నా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. అనంతరం జాతీయ జెండా ఎగుర వేసి, గాంధీ చిత్ర పటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, జెడ్పీ మాజీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కనుదాస్, మాఘరో సంస్థ కన్వీనర్ కాధంబని త్రిపాఠి ఉన్నారు.


