వర్షాలపై ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

వర్షాలపై ఆందోళన వద్దు

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

● హెచ్చరిక స్థాయి కంటే దిగువనే నదుల నీటిమట్టాలు ● మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి ● వరద నష్టాలు వేగవంతంగా అంచనా వేయాలని ఆదేశం

● హెచ్చరిక స్థాయి కంటే దిగువనే నదుల నీటిమట్టాలు ● మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి ● వరద నష్టాలు వేగవంతంగా అంచనా వేయాలని ఆదేశం

భువనేశ్వర్‌: రాష్ట్రంలో వర్షాల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నదుల్లో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిల కంటే దిగువన కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి శనివారం తెలిపారు. స్థానిక లోకసేవా భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకస్మిక విపత్తు నిర్వహణ కోసం సహాయక సంస్థలను అప్రమత్తంగా ఉంచామన్నారు. శనివారం ఉదయం నయాగడ్‌ జిల్లా కేంద్రాపడాలో అత్యధికంగా 137 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. సంబల్‌పూర్‌ జిల్లా కుచిందాలో 115 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, డెరాబిష్‌లో 108 మిల్లీ మీటర్లు, జాజ్‌పూర్‌ జిల్లా బొడొచొణ ప్రాంతంలో 96 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దేవ్‌గడ్‌, కెందుఝర్‌, కటక్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 59 నుంచి 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.

వర్షాలతో ముప్పు లేదు

ఈ వర్షాల వల్ల తక్షణ ముప్పు ఏమీ లేదని మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇటీవలే వరదల నుంచి కోలుకుంటున్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర, మధ్య, దక్షిణ ఒడిశా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారిక సూచనలను పాటించాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రజలు సమీపంలోని తహసీల్‌ కార్యాలయం, మండల అభివృద్ధి అధికారి లేదా జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలన్నారు. జాజ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌లలో ఇటీవలి వరదల నీరు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన నదుల్లో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిల కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. మహానది, నరాజ్‌ బ్యారేజీ నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే తక్కువగా ఉందన్నారు. కుశభద్ర, దేవి, బ్రాహ్మణి, బైతరణి, బుఢాబొలొంగొ, సువర్ణ రేఖ, జలకా, రుషికుల్య, వంశధార నదుల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.

రెండు రోజుల్లో నష్ట నివేదిక

రాష్ట్రవ్యాప్తంగా వరద నష్ట అంచనా తుది నివేదికల దాఖలు వేగవంతం చేయాలని మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. వరద నీరు ఇంకా పూర్తిగా తగ్గని కొన్ని జిల్లాల నుంచి పరిస్థితులు మెరుగుపడిన వెంటనే తమ అంచనాలను సమర్పించాలన్నారు. నష్టం అంచనాలను ఆలస్యం లేకుండా పూర్తి చేసి నష్ట పరిహారం చెల్లింపులను వేగవంతం చేసి తుది నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన నిధుల నుంచి ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయాలన్నారు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక అంచనా ప్రకారం వరదల వల్ల దాదాపు 23 జిల్లాలు పాక్షికంగా ప్రభావితమై 3,567 ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు 37,297 హెక్టార్ల వ్యవసాయ భూమి నష్టపోయినట్లు నివేదికలు దాఖలు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల నుంచి నివేదికలు అందిన తర్వాత నష్ట పరిమాణం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యుత్‌, మహిళా, శిశు అభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖలతో పాటు ఇతర శాఖలను కూడా రంగాల వారీగా నష్ట నివేదికలను సమర్పించాలని సూచించారు. సమావేశానికి ప్రత్యేక సహాయ కమిషనర్‌ రాజేష్‌ ప్రభాకర్‌ పాటిల్‌, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement