జ్వరంతో కేజీబీవీ విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

జ్వరంతో కేజీబీవీ విద్యార్థిని మృతి

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

● సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ

● సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ

రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌ సమితి దుర్గిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే విద్యాలయం సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలు లాంజిపదర్‌ గ్రామానికి చెందిన పూర్ట గంట కుమార్తె భూమిక గంటా (17)గా గుర్తించారు. భూమికకు ఈ నెల ఐదో తేదీన జ్వరం రావడంతో వార్డెన్‌ ఆమెను దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అనంతరం కేజీబీవీ వసతి గృహానికి తీసుకువచ్చారు. అయితే ఈ నెల ఆరో తేదీ అర్ధరాత్రి సమయంలో భూమికకు జ్వరంతో పాటు విరేచనాలు, వాంతులు కావడంతొ మరోసారి దుర్గి ఆరోగ్య కేంద్రంలో చేర్పించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్న అనంతరం భూమికను బిసంకటక్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు.. అక్కడ నుంచి స్థానిక క్రిస్టియన్‌ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూమిక శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారంగానే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అనంతరం భూమిక మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో స్వగ్రామమైన లాంజిపదర్‌ గ్రామానికి తరలించారు.

కమిషనరేట్‌ పోలీసులకు రాష్ట్రపతి పతకాలు

భువనేశ్వర్‌: ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పతకాలకు కటక్‌, భువనేశ్వర్‌ జంట నగరాల కమిషనరేట్‌ పోలీసులు ఎంపికయ్యారు. వారిలో విశిష్ట సేవకు భువనేశ్వర్‌ ఓఎస్‌ఏపీ 7వ బెటాలియన్‌, డీసీపీ (సాయుధ) ప్రఫుల్ల కుమార్‌ సింగ్‌, మెరిటోరియస్‌ సేవకు కటక్‌ కమిషనరేట్‌ పరిధిలో బారంగ్‌ పోలీస్‌ ఠాణా ఏఎస్‌ఐ నిగమానంద మహా పాత్రో ఎంపిక కావడం విశేషం. వీరికి భువనేశ్వర్‌, కటక్‌ జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి అచంచలమైన అంకిత భావం, అసాధారణ నాయకత్వం, కర్తవ్యంపై వారి నిబద్ధత, ఆదర్శప్రాయమైన సేవ స్ఫూర్తినిస్తాయని అభినందించారు.

నీటిలో మునిగి బాలుడు మృతి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లచ్చిపేటలో శనివారం తల్లిదండ్రులతో కలిసి పొలానికి మూడేళ్ల బాలుడు అమాన్‌ మాడీ (3)ని తీసుకెళ్లారు. పొలానికి సమీపంలోని నీటిగుంతలో మునిగి బాలుడు మృతి చెందాడు. లచ్చా మాడీ, సుఖీ మాడీ పొలం పనులు చేసుకొని లచ్చాపేటలో నివాసిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు అమాన్‌ మాడీ, నాలుగు నెలాల బాబు ఉన్నారు. శనివారం ఉదయం ఇద్దరినీ పొలం పనుల వద్దకు వెంట తీసుకెళ్లారు. బాబును చూడమని గట్టుపైన ఉన్న పాక వద్ద ఉంచారు. అమాన్‌ సమీపంలో నీటిగుంత వద్దకు వెళ్లాడు. అక్కడ ఆడుతూ అందులో పడిపోయాడు. నీరు ఉండటంతో మునిగిపోయాడు. కొంత సమయానికి అమాన్‌ కనిపించకపోవడంతో తల్లి సుఖీ చుట్టు పక్కల వెతికింది. జాడ లేకపోవడంతో అక్కడే ఉన్న గుంత వద్ద వెతికారు. అందులో అమాన్‌ తేలుతూ కనిపించాడు. తండ్రి లచ్చా మాడీ వెంటనే దిగి బాబును బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. సమీపంలో ఉన్న గ్రామస్తులు అంతా వచ్చి ఎంవి 79 పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అర్జున్‌ బాంక సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement