వారానికి ఒక్కసారైనా
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది నేత కుటుంబాలకు మద్దతుగా చేనేతను జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారానికి కనీసం ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని ఒడిశా ప్రజలకు గవర్నర్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఈ చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది నేత కుటుంబాలకు మద్దతునిచ్చే ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారగలదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చేనేత వస్త్రం నినాదంతో స్థానిక ఇడ్కో ప్రదర్శన మైదానంలో ఈ ఏడాది జరుపుకుంటున్న 12వ రాష్ట్ర స్థాయి జాతీయ చేనేత దినోత్సవ ప్రారంభోత్సవం పురస్కరించుకుని గవర్నర్ ప్రసంగించారు.
1905 నాటి స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ దినం భారత దేశ నాగరికత, సంస్కృతి, శతాబ్దాల దేశ నేత వారసత్వాన్ని పరిరక్షించిన నైపుణ్యం గల చేతులకు నివాళి అని గవర్నర్ అభివర్ణించారు. ప్రతి చేనేత వస్త్రం నైపుణ్యం, పట్టుదల, కుటుంబ సంప్రదాయం, మానవ సృజనాత్మకత పెన వేసుకుని ఉంటుందని గవర్నర్ అన్నారు. సంబల్‌పురి బొంధొ, ఒడిశా ఇక్కత్, బొంకై , ఖండూవా, కోట్‌పాడ్, హబస్‌పూరి, బరంపురం పట్టు, గోపాల్‌పూర్ తస్సర్ వంటి ఒడిశా యొక్క ప్రఖ్యాత చేనేత ఉత్పత్తులు కళాకారుల అంకితభావాన్ని, వ్యక్తిగత స్పర్శను ప్రతిబింబిస్తాయి. చేనేత ఉత్పత్తి కొనుగోలు ఒక కుటుంబానికి మద్దతు ఇచ్చి గ్రామీణ ఉపాధిని బలపరుస్తుంది. మహిళలకు సాధికారత పరిరక్షణతో సంప్రదాయ జ్ఞానం పరిరక్షణ, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందన్నారు.
డిజైన్ ఆవిష్కరణ, డిజిటల్ మార్కెటింగ్, పర్యాటక అనుసంధానాలు, సంస్థాగత మద్దతు, సాంకేతికత ఆధారిత ఉత్పత్తుల ఉనికిని గుర్తించడం వంటి వాటి ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి చేపట్టిన కార్యక్రమాలను గవర్నర్ అభినందించారు. రాష్ట్ర చేనేత పురస్కారాల గ్రహీతలను అభినందిస్తూ నేత కార్మికులు అమూల్యమైన సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులని గవర్నర్ కొనియాడారు. ఒడిశా చేనేత రంగం నిరంతరం ప్రపంచ వేదికపై రాష్ట్ర గుర్తింపు, సృజనాత్మకత మరియు శ్రేష్ఠతను ప్రదర్శిస్తూనే ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కుసుమ్–అంతరించిపోయిన వస్త్ర పునరుద్ధరణ, కరుణా సిల్క్ పై వీడియోలను ప్రదర్శించారు. జగత్‌సింగ్‌పూర్‌లోని కస్తా హ్యాండ్లూమ్ భవన్, జాజ్‌పూర్‌లోని సుకిందలో ఓఎంబీఏడీసీ ఆధ్వర్యంలోని టసర్ సిల్క్ పార్క్ ఫేజ్–1, టసర్ ఫెసిలిటీ సెంటర్‌కు శంకుస్థాపన చేయగా, ఖోర్ధాలోని రౌత్‌పడాలో ఉన్న ఫ్యాబ్రిక్ క్యాలెండరింగ్ యూనిట్‌ను గవర్నర్ వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రాసిమ్ ఇండియా లిమిటెడ్, సుస్థిర ఫ్యాషన్ కోసం జూబీస్ డిజైనర్ స్టూడియో, అమెజాన్ కరిగర్‌లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా చేనేత, వస్త్ర మరియు హస్తకళల శాఖకు చెందిన 2025–26 వార్షిక కార్యాచరణ నివేదికను గవర్నర్ ఆవిష్కరించారు. సహకార, చేనేత, వస్త్ర మరియు హస్తకళల శాఖ మంత్రి ప్రదీప్ బాల్ సామంత ఈ సభను ఉద్దేశించి ప్రసంగించారు. చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి గుహా పూనమ్ తాపస్ కుమార్, వస్త్ర మరియు చేనేత శాఖ డైరెక్టర్ సూర్య నారాయణ్ పట్నాయక్ కార్యక్రమంలో ప్రసంగించారు.


