● నిర్మాణ సామగ్రి స్వాధీనం
రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన చోరీ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ నెల 4వ తేదీ అర్ధ రాత్రి జరగిన ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని కొందరు దుండగులు తాళం పగుల గొట్టి నిర్మాణ పనులకు ఉపయోగించే కాంక్రీట్ బ్రేకర్ మిషిన్, రాడ్ కట్టింగ్ మిషిన్‌తోపాటు ఇతర నిర్మాణ సామగ్రిని అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి చోరీకి గురైన కాంక్రీట్ బ్రేకర్ మిషిన్, రాడ్ కట్టింగ్ మిషిన్‌తో పాటు ఇతర నిర్మాణ సామగ్రీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టుకు తరలించారు.
నూతన కార్యవర్గం ఏర్పాటు
రాయగడ: స్థానిక సంస్కృతి మహిళా సంస్థకు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. సంస్థ అధ్యక్షురాలిగా సరస్వతి సాహు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదివరకు సాము సంస్థలో క్రీయాశీల సభ్యురాలిగా, కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండేవారు. అదేవిధంగా సంస్థ ఉపాధ్యక్షురాలిగా అమూల్య కుమారి మిశ్రా, కార్యదర్శిగా సంతోషి సేనాపతి, సహా కార్యదర్శిగా సుజాత మండంగి, కోశాధికారిగా లక్ష్మీ దేయాలను సభ్యులు ఎన్నుకున్నారు. సుజాత పాలో, మాజీ కోశాధికారి శ్రమిత పాడీ, పద్మాలయ మిశ్రా బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో భవిష్యత్‌లో సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రచార రథం ప్రారంభం
రాయగడ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం–26ను పురస్కరించుకుని జిల్లా ఆదివాసీ సమాజ్ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని గురువారం ప్రారంభించారు. స్థానిక మజ్జిగౌరి మందిరం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన ఆదివాసీ నాయకులు ఈ మేరకు ప్రచార రథానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను మరింత వైభవంగా, విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో గల వివిధ ప్రాంతాల్లో ఈ రథఽం తిరిగి ఉత్సవాల వివరాలను తెలియజేస్తుంది. ఆదివాసీ నాయకులు బసంత కుమార్ ఉలక, హరప్రసాద్, గోపీనాథ్ సరక, అశోక్ పుయాల, మీనారావు హిమిరిక పాల్గొన్నారు.
పాముకాటుతో వ్యక్తికి అస్వస్థత
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి జి.మఝిగుడ గ్రామ పంచాయతీ నగియగుడ గ్రామానికి చెందిన చైతన్య గౌఢ (45) పాము కాటుకు గురికావడంతో తీవ్ర అస్వస్థతకుగురయ్యారు.అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. లభించిన సమాచారం.. ప్రకారం చైతన్య గౌఢ గురువారం మధ్యాహ్నం తన సొంత ఆవులు, గొర్రెలు మేపేందుకు గ్రామ సమీప అడవి లోనికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చూసుకోకుండా పొరపాటున పాముపై కాలు వేయడంతో కాటు వేసింది. అది చూచిన కొంతమంది వెంటనే అతడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు వచ్చి గ్రామస్తుల సహకారంతో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం అందజేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అచ్చట నుండి జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు.
హుండీల ఆదాయం రూ.2.06 లక్షలు
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడివీధిలో వేంచేసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయం హుండీల ఆదాయం రూ.2,06,931లు వచ్చిందని ఆలయ ఈవో ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. నోట్ల రూపేనా రూ.1,88,310లు, చిల్లర రూపేనా రూ.18,621లతో కలిపి మొత్తం రూ.2,06,931 వచ్చిందని వెల్లడించారు. పర్యవేక్షకులుగా ఏసీ ఆఫీసు నుంచి సూపర్‌వైజర్ ఎస్.నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ, చైర్మన్ పాండ్రంకి దేవేంద్ర నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, లలితా మండలి సభ్యులు, భక్తుల సమక్షంలో హుండీలు తెరవడం జరిగిందన్నారు.


