కొరాపుట్: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 180 మంది విద్యార్థులు హాస్టల్ విడిచి వెళ్లడం కలకలం రేపింది. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి సన్న టెమరా గ్రామంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో 180 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఉదయం లేచాక హాస్టల్ సిబ్బందికి ఒక్క విద్యార్థి కూడా కనిపించకపోవడంతో బెంబేలెత్తిపోయారు. ఈ విషయం ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మీ మహారాణకి సమాచారం ఇచ్చారు. దాంతో ఉన్నతాదికారులు ఉరుకులు పరుగులతో హాస్టల్‌కు వచ్చారు.
వసతులు లేకే నిరసన..
విద్యార్థులంతా ముందు రోజు రాత్రి మూకుమ్మడిగా ఇళ్లకు వెళ్లి పోవాలని నిర్ణయం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మూటాముల్లె సర్దుకొని ఇళ్లకి పయనమయ్యారు. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వీరి స్వగ్రామాలు ఉండడంతో నడక మార్గం కొనసాగించారు. మార్గ మధ్యంలో వీరిని చూసిన పలు గ్రామాల గిరిజనులు ఈ విషయం సోషల్ మీడియాలో పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఎందుకీ పయనం..?
వీరిని అడ్డగించిన మీడియా ముందు విద్యార్థులు తమ గోడు వెళ్ల బుచ్చుకున్నారు. హాస్టల్‌లో సుమారు 180 విద్యార్థులు ఉన్నారని వారందరినీ రెండు గదుల్లో ఉంచారని తెలిపారు. ఆ గదులు కూడా వర్షం వస్తే కారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు వినియోగించడానికి వీల్లేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతున్నారని, క్రీడా సామగ్రి ముట్టుకోనివ్వడం లేదని తెలిపారు. వీటిని ముడితే హెడ్ మాష్టర్ రాజ్యలక్ష్మి మహారాణ తీవ్రంగా దూషిస్తున్నారన్నారు. తమ సమస్యలు చెబితే ఎదురు దాడి చేస్తున్నారన్నారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దాంతో అక్కడ ఉండలేక తామందరూ ఇళ్ల కు పోతున్నామని పేర్కొన్నారు.
అడ్డగించిన విధ్యాధికారులు
విద్యార్థుల ఆచూకీ తెలుసుకున్న విద్యాధికారులు పలు చోట్ల వారిని అడ్డుకున్నారు. సమీప ప్రభుత్వ హాస్టల్లోకి చేర్చి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తిరిగి వారిని హాస్టల్‌కు తీసుకెళ్లడం ప్రారంభించారు.


