రాయగడ: గుణుపూర్‌లోని వివిధ ల్యాంప్స్ పరిధిలో ఉన్న ఎరువుల గొదాంలను సహకార సంఘాల రిజిస్ట్రార్ మనీష్ అగ్రవాల్ పరిశీలించారు. గుణుపూర్ ల్యాంప్స్ పరిధిలోని లిమామడ, సమీపంలోని ఎరువుల గొదాంలను, పద్మపూర్‌లోని గొదాంలను తనిఖీ చేసి ఎరువుల నిల్వల పరిస్థితిని సమీక్షించారు. తనిఖీల సందర్భంగా యూరియా, పొటాస్, తదితర ఎరువుల నిల్వలు, పంపిణీ విధానం, ఆర్థిక లావాదేవీలపై అధికారులతో చర్చించారు. రైతులు ఎరువుల ధరలు, అందుబాటులో ఉన్న నిల్వల వివరాలు సులభంగా తెలుసుకునేలా ప్రతీ గొదాంలో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. ఎరువులకు సంబంధించిన అన్ని వివరాలను ఒడియా భాషలో అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు నారు, వరిసాగు పనుల్లో నిమగ్నమై ఉండటంతో యూరియా ఎరువుకు డిమాండ్ పెరిగిందన్నారు. అవసరమైన యూరియా అందడం లేదని కొందరు రైతులు చేసిన ఫిర్యాదులను ఆయన సీరియస్‌గా తీసుకుని, ఎరువుల సరఫరా వ్యవస్థను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో రాష్ట్ర ప్రభుత్వ అదనపు క్యాదర్శి సంగ్రామ్ కేసరి రౌత్, గుణుపూర్ బజారు నియంత్రణ కమిటీ కార్యదర్శి దళపతి కార్యి, డీఆర్‌సీఎస్ యజ్ఞమేజయ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు.


