రాయగడ: జిల్లాలోని గుణుపూర్ పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా క్లీనిక్‌లు నిర్వహిస్తున్న వాటిపై జిల్లా యంత్రాంగం మరోసారి కొరఢా ఝలిపించింది. సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లీప్, డిప్యూటీ కలెక్టర్ సుబ్రస్నాత్ రౌత్ బుధవారం మధ్యాహ్నం పాత గుణుపూర్ కూడలిలో ఉన్న ఎంఎం క్లీనిక్, విజయలక్ష్మీ క్లీనిక్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఈ రెండు క్లీనిక్‌లలోనూ రోగులను చేర్చి సైలెన్‌లు ఎక్కిస్తూ చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు వస్తున్న సమచారాన్ని తెలుసుకున్న మరికొన్ని క్లీనిక్‌ల యజమానులు రోగుల సైలెన్ పెపులను తొలగించి క్లీనిక్ వెనుక ద్వారం గుండా వారిని బయటకు పంపించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ దిల్లీప్.. జిల్లా ముఖ్యవైద్యాధికారికి నివేదిక పంపించారు. సంబంధిత క్లీనిక్‌ల అనుమతులు, ఇతర పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖను కొరినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొద్ది నెలల క్రితమే గుణుపూర్ ప్రాంతంలోని పలు అక్రమ క్లీనిక్‌లపై సబ్ కలెక్టర్ వరుసగా దాడులు నిర్వహించి హెచ్చరించారు. ముఖ్యంగా ఎంఎం క్లీనిక్‌పై ఇప్పటికే రెండుసార్లు తనిఖీలు జరిగినప్పటికీ, అక్కడ మళ్లీ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించడం గమనార్హం.


