బ్యాడ్మింటన్‌ చాంపియన్లుగా లక్ష్మివైశాక్‌, నవ్య | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ చాంపియన్లుగా లక్ష్మివైశాక్‌, నవ్య

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో నాలుగురోజులపాటు కన్నులపండువలా సాగిన సీనియర్స్‌ బ్యాడ్మింటన్‌ స్టేట్‌మీట్‌ బుధవారంతో ముగిసింది. శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడి యం వేదికగా జరిగిన పోటీల్లో విశాఖపట్నం, కృష్ణ, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం షట్లర్లు సత్తా చాటి జయకేతనం ఎగురవేశారు.

విజేతల వివరాలు ఇవి..

● పురుషుల సింగిల్స్‌లో ఎం. లక్ష్మివైశాక్‌ (విశాఖపట్నం) చాంపియన్‌గా నిలవగా, టి.హర్షణ్‌ (కృష్ణ) రన్నరప్‌గా నిలిచాడు.

● పురుషుల డబుల్స్‌ విభాగంలో వి.హరికృష్ణ (తూర్పుగోదావరి)–టి.చరణ్‌రామ్‌ (చిత్తూరు) జంట విజేతగా నిలవగా, సాయిపవన్‌ కర్రి (తూర్పుగోదావరి)–ఎం.ధర్మాఘ్న(గుంటూరు) జంట రన్నరప్‌గా నిలిచారు.

● ఇక మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా కందేరి నవ్య (చిత్తూరు)నిలవగా, కె.దుర్గా ఇషా (తూర్పుగోదావరి) రన్నరప్‌గా నిలిచింది.

● మహిళల డబుల్స్‌ విభాగంలో డి.దీపిక (గుంటూరు)–డి.శ్రవంతి(గుంటూరు) జంట విజయదుందుబి మోగించగా, కె.సరియు(ప్రకాశం)– వి.వైష్ణవి(విశాఖపట్నం) జంట రన్నరప్‌గా నిలిచారు.

● మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కర్రి సాయిపవన్‌ (తూర్పుగోదావరి)–దండు పూజ (చిత్తూరు) జంట విజేతగా నిలవగా, బి.అభిషేక్‌ (తూర్పుగోదావరి)–గగనశ్రీ చౌదరి కె (కృష్ణ) రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.

జాతీయ పోటీల్లో సత్తాచాటాలి..

ఏపీ సీనియర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులంతా సౌత్‌జోన్‌ నేషనల్స్‌, ఆలిండియా నేషనల్స్‌ పోటీల్లో నూ ఇదే స్ఫూర్తితో రాణించి విజయదుందుబి మోగించాలని ఏపీ బ్యాడ్మింటన్‌ సీఈఓ, ఏఎస్పీ ఈగల్‌ టీం విశాఖపట్నం చుక్కా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నాలుగు రోజుల జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు నిర్వహణ కమిటీ ప్రతినిధులతో కలిసి టైటిల్స్‌, ప్రసంశాపత్రాలను అందజేశారు.

సిక్కోలు ఆతిథ్యం భేష్‌

స్టేట్‌మీట్‌కు హాజరైన వివిధ జిల్లాల క్రీడాకారులు సిక్కోలు ఆతిథ్యాన్ని మరువలేమని సంతోషం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోయినా నిర్వాహకులు క్రీడాకారులకు చక్కటి సదుపాయాలు కల్పించి గొప్పగా చూసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement