రాయగడ: గ్రామాభివృద్ధికి తమవంతు సహకరిస్తామని ఆదివాసీ యువశక్తి సంఘం (ఆయూస్) ప్రతినిధులు వెల్లడించారు. సదరు సమితి పరిధిలోని బాయిసింగ్ గ్రామంలో ఆదివాసీ గ్రామ సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులతో ఆయూస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఏడు ప్రధాన సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు చేపడతామని సంఘం ప్రతినిధులు తెలిపారు. సదస్సుకు సంఘం వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త విజయ కుమార్ మెలక అధ్యక్షతన వహించగా, సహ వ్యవస్థాపకుడు కామేశ్వర్ బిడిక సహకరించారు. గ్రామానికి చెందిన యోహన్ తాడింగి, రంగపాలక్, గురునాఽథ్ తాడింగి, నరి తాడింగి, మణికంఠ తాడింగి, లొకేష్ తాడింగి, విక్రమ్ తాడింగి, గిరపా తాడింగి, లదా సిరిక, జామ తాడింగి స్వఛ్చందంగా ఆయూస్ గ్రామ కమిటీలొ సభ్యత్వం స్వీకరించారు. నూతన సభ్యులకు సంఘం లక్ష్యాలు, విధివిధానాలు, బాధ్యతలపై త్వరంలో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం సంఘం వ్యవస్థాపకుడు విజయ కుమార్ మెలక ఆధ్వర్యంలో సభ్యులు గొప్యతను కాపాడుతూ సంఘం ఆదర్శాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆదివాసీ యువశక్తి (ఆయూస్ ) 2026 మే ఒకటో తేదీన ఆన్‌లైన్ వేదికగా ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో 30 మంది జీవితకాల సభ్యులుగా ఉన్నారని, ఒడిశా వ్యాప్తంగా లక్షమంది సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని వెల్లడించారు. ఆదివాసీ భాషలు, సాహిత్యం, సంస్కృతి, అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయడం సంఘం ప్రధాన ఉద్యేశమని ప్రతినిధులు వెల్లడించారు. గ్రామం నుంచి ఐక్యత–ఐక్యతతో అభివృద్ధి అనే నినాదంతో గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాలకు జిల్లా సమన్వయకర్తలు ఎంపిక చేసిన ఆయూస్, దశల వారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు విశేషంగా కృషి చేస్తుందని వివరించారు.
ఆదివాసీ యువశక్తి సంఘం ప్రతినిధులు


