జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ పోలీసు స్టేషన్ పరిధిలో హోంగార్డ్ ప్రసాద్ పూజారి పై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి(ఎస్‌డిసిఓ)కుమారి అర్చిత మిత్తల్ మీడియాకు తెలిపారు. జయపురం జయపురం సదర్ పోలీసుస్టేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె హోంగార్డ్‌పై హత్యాయత్నాన్ని వివరించారు. పూర్వ శతృత్వం వల్లనే నిందితులు హత్య చేసేందుకు దారి కాచి దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆమె వెల్లడించారు. డ్యూటీలో ఉన్న హోంగార్డ్ ప్రసాద్ పూజారి తన స్వగ్రామం గుమ్మకు వెళ్లి తిరిగి బొయిపరిగుడ వస్తున్న సమయంలో దుండగులు ముందుగా వేసుకున్న పథకం దాడి జరిపారని వెల్లడించారు. ఈ సంఘటనపై బొయిపరిగుడ పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు ఒక ప్రత్యేక పోలీసు టీమ్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. పోలీసులు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు, వైజ్ఞానిక ప్రమాణాలు, ఇతర ఆధారాలతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. అరెస్టు అయిన వారు బొయిపరిగుడ సమితి పూజారిగుడ గ్రామం అజయ హరిజన్, అజిత్ సాగరియ, మాధవ మఝి అని వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరచినట్లు కుమారి మిత్తల్ వెల్లడించారు. బొయిపరిగుడ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారని వెల్లడించారు.


