రాయగడ: జిల్లాలో అక్రమ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జనతా గ్రామం సమీపంలో ఆరు పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. జనతా గ్రామం నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రాంతంలో అనుమానస్పదంగా ఎరువుల లోడుతో వెళ్తున్నలారీని ఆపి తనిఖీ చేశారు. ప్రాథఽమిక పరిశీలన అనంతరం ఆ లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రెండు వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యలు కోసం రాయగడ పోలీసులకు అప్పగించారు. అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఇలాంటి ఆకస్మిక తనిఖీలు, దాడులు భవిష్యత్‌లో కూడా కొనసాగుతాయన్నారు.
మండుతున్న ఎండలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పర్లాకిమిడిలో గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. శ్రావణ మాసంలో ఇంతటి ఉక్కపోత ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. పర్లాకిమిడిలో పగటి ఉష్ణోగ్రతులు 36 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురిసినా ఉక్కపోత తగ్గలేదు. ఎండలు పెరగడంతో కలెక్టరేట్ వద్ద నిర్మాణుష్యంగా కనిపించింది.
వివాహితపై భర్త, కుటుంబ సభ్యుల దాడి
మెళియాపుట్టి: మండలంలోని చాపర గ్రామానికి చెందిన వివాహిత తమిరి మాధవిపై తన భర్తతోపాటు కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ మేరకు మాధవి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హెచ్‌సీ ఢిల్లేశ్వరరావు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చాపరకు చెందిన దారపు ధనుంజయరావు, తమిరి మాధవికి 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఇటీవల ధనుంజయరావు ఆర్మీలో పదవీ విరమణ పొందాడు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చిన సొమ్ము మొత్తం మాధవి భర్త ధనుంజయ.. అతని అన్న లక్ష్మీనారాయణకు అప్పజెప్పడంతో మాధవి ప్రశ్నించింది. దీంతో ఆమైపె తన భర్తతోపాటు అత్త మామలు, బావ లక్ష్మీనారాయణ దాడికి పాల్పడ్డారు. వివాహం అయిన తర్వాత ఎటువంటి కట్నం, భూమి తీసుకురాలేదు, నీకు ప్రశ్నించే హక్కులేదని నలుగురూ కలిసి దాడి చేశారని తెలిపారు. అదేవిధంగా వరకట్నం తీసుకురావాలి, లేదంటే విడాకులకు అంగీకరించాలని ఒత్తిడికి గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన నలుగురిపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
నేడు జిల్లాస్థాయి పోటీలు
అరసవల్లి: కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు మై భారత్ కేంద్ర (ఎన్‌వైకే) ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లుగా జిల్లా యూత్ ఆఫీసర్ ఎన్.కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు మై భారత్ పోర్టల్ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. వివిధ అంశాల్లో జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు.


