భువనేశ్వర్: గ్రీన్ ఉద్యోగ్, పర్యావరణ పరిరక్షణ రంగాలలో అసాధారణ కృషికి గాను ఒడిశాకు చెందిన 13 ఏళ్ల వాతావరణ కార్యకర్త మోక్ష ధరణి పాణిగ్రాహికి ప్రతిష్టాత్మక ప్రైడ్ ఆఫ్ ఇండియా 2026 పురస్కారం లభించింది. ఆమె ఈ పురస్కారాన్ని ‘గ్రీన్ స్టార్టప్’ విభాగంలో అందుకున్నారు. కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి జీతన్ రామ్ మాంఝీ, ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు, సీషెల్స్ హైకమిషనర్ సమక్షంలో న్యూఢిల్లీలో జరిగిన ’ప్రైడ్ ఆఫ్ ఇండియా లీడర్‌షిప్ సమ్మిట్ 2026’ సందర్భంగా మోక్షకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీత మోక్ష ధరణి పాణిగ్రాహి గజపతి జిల్లా, పర్లాఖిముండి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రాహి, హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డైరెక్టర్, ట్రస్టీ మధుస్మిత త్రిపాఠి దంపతుల పెద్ద కుమార్తె. మోక్ష 2018లో తన గ్రామంలో ఒక వాతావరణ ఉద్యమంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె చిన్నప్పటి నుంచే వాతావరణం, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం గళం విప్పుతోంది. ప్రస్తుతం ఆమె దేశ వ్యాప్తంగా పర్యావరణ అవగాహన కల్పిస్తూ ‘ఎర్త్ ఎగైన్ మూవ్‌మెంట్’, ‘ది చైల్డ్ మూవ్‌మెంట్’, ‘సీటీబీటీ యూత్ గ్రూప్’లలో సభ్యురాలిగా చురుకై న పాత్ర పోషిస్తోంది. ఆమె కేవలం అవగాహన కల్పించడమే కాకుండా గొప్ప మార్పు తీసుకురావడానికి క్షేత్ర స్థాయిలో విశేషంగా కృషి చేస్తుంది. హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను తూర్పు భారత దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఆస్పత్రిగా తీర్చిదిద్దడంలో ఆమె నాయకత్వం కీలక పాత్ర పోషించింది. విస్తృతమైన వృక్షారోపణ, వ్యర్థాల పునర్వినియోగం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించింది. మోక్షకు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఒడిశా రాష్ట్రం మొత్తానికి గర్వకారణం అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన, పచ్చని, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించే దిశగా యువతకు ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది అని హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి, డైరెక్టర్ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి అన్నారు.
హై టెక్ బృందం అభినందన
జాతీయ పురస్కారం అందుకున్న వాతావరణ కార్యకర్త మోక్ష ధరణి పాణిగ్రాహికి హై టెక్ గ్రూపు అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. మోక్ష ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ రంగంలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని వారంతా శుభాకంక్షలు తెలిపారు.


