రాయగడ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కొనసాగుతున్న నషా ముక్త్ అభియాన్ ఒడిశాలో భాగంగా ఝార్సుగుడ జిల్లా బడ్మాల్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి వాణిజ్య పరిమాణంలో అక్రమ కొడైన్ ఆధారిత దగ్గు సిరఫ్ ను స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర విలేకర్లకు సొమవారం నాడు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు తుండెకెలా సమీపంలోని ఫ్‌లై యాస్ ఇటుకల కర్మాగారం వద్దకు అక్రమ కొడైన్ దగ్గు సిరఫ్‌తో కూడిన లారీ రానున్నట్లు తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, స్వతంత్ర సాక్షుల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. తుంబెకెల వద్ద లారీతొ పాటు హుండాయ్ కారును అడ్డగించి తనిఖీ చేయగా 197 సీల్ట్ కార్టన్‌లలో 23,640 విన్‌సెరెక్స్ కొడైన్ ఫాస్పెట్ అండ్ ట్రిపోలిడిన్ హెడ్రొక్లోరైడ్ దగ్గు సిరఫ్ బాటిళ్లు లభ్యమయ్యాయి. మొత్తం 2,364 లీటర్ల సిరప్ స్వాధీనం చేసుకోగా, ఇది ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం వాణిజ్య పరిమాణంగా గుర్తించారు. ఈ కేసులో బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ అప్సాన్ ,పశ్చిమ బెంగాళ్‌లోని బర్ధమాన్ ప్రాంతానికి చెందిన రిజ్వాన్ అన్సారి లను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుల నుంచి అక్రమ దగ్గు సిరప్ బాటిళ్లతో పాటు రూ.2.44 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.


