జయపురం: జయపురం సమితి భరిణిపుట్ గ్రామ పంచాయతీ అప్పర్ కొలాబ్ ప్రాజెక్ట్ ఉన్నత పాఠశాలలో గత నెల 31 వ తేదీన జరిగిన విద్యార్థి హత్య కేసులో జయపురం సదర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ నేడు వెల్లడించారు. అరెస్టయిన వారు అప్తాల్ హియాల్, కాగా మరొకరు మైనర్ బాలుడని వెల్లడించారు. జయపురం ఎస్‌డీపీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె సంఘటన వివరా లు వెల్లడిస్తూ జూలై 31 వ తేదీన మధ్యాహ్న భోజనాల అనంతరం విరామం సమయంలో పాఠశాల విద్యార్థులకు బయట కుర్రవాళ్లకు వాగ్వాదం జరిగిందని, ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక విద్యార్థి వెళ్లి ఉభయవర్గాలకు సమాధాన పరుస్తున్న సమయంలో ఒకడు అతడిని పట్టుకోగా మరొకరు పదునైన కత్తితో అతడి కడుపులో పొడిచాడని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని వెంటనే ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్చారు. డాక్టర్ అతడిని పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారని పోలీసు అధికారి వెల్లడించారు. సమాచారం అందిన జయపురం సదర్ పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్లి విచారణ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని వెల్లడించారు. కేసు దర్యాప్తు అధికారి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.


