● ఉపాధి కూలీలకు వచ్చిన నిధులను కాజేసిన కూటమి నేతలు ● ఒక్కో వేతనదారు నుంచి రూ.500 చొప్పున స్వాహా
శ్రీకాకుళం రూరల్ :
ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి వేతనదారులకు కమిషన్ రూపంలో వచ్చిన సొమ్మును కూటమి నేతలు మింగేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని కల్లేపల్లి పంచాయతీ జాలారీపేట, మోపసుబందరు గ్రామాలకు మూడు నెలల కిందట రోడ్డు మంజూరైంది. మోపసుబందరు రామాలయం నుంచి శ్మశానవాటిక వరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.10 లక్షలతో ఈ రోడ్డు వేశారు. ఇదే గ్రామానికి కొందరు కూటమి నాయకులు ఈ పనులను దక్కించుకున్నారు. ఆ సమయంలో సుమారు 275 మంది ఉపాధి వేతనదారులను తీసుకెళ్లి రోడ్డు పనులు జరుగుతున్న చోట వారితో ఫోటోలు తీయించారు. వాస్తవానికి వేజ్ కాంప్రూట్ (కూలీలు ఏర్పాటుకు)కు పది శాతం వేతనదారులకు ఇవ్వాలి. అంటే రూ.10 లక్షల్లో లక్ష రూపాయలు వేతనదారులకు అందించాల్సి ఉంది. ఆ సొమ్ములు కాజేసేందుకు కూటమి నాయకులు పక్కా ప్లాన్ వేసి ఓ మహిళా నాయకురాలిని రంగంలోకి దించారు. ఆమె ద్వారా వేతనదారుల అకౌంట్ల లో పడిన డబ్బులను దౌర్జన్యంగా లాగేసుకున్నారు. ఒక్కో వేతనదారుకు రూ.600 చొప్పున పడగా ఏకంగా రూ.500 చొప్పున లాగేసుకున్నారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం సదరు మహిళను నిలదీయగా వారినే తిరిగి తిట్టడం గమనార్హం.
నాకు తెలియదు..
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి లక్ష్మి వద్ద ప్రస్తావించగా పనులు జరిగిన వాస్తవమేనన్నారు. కూలీలకు వచ్చిన వేతనాలు పక్కదారి పట్టిన విషయం తనకు తెలియదన్నారు.


