● న్యాయవాదుల సంఘం ఆగ్రహం
రాయగడ: రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయ్ వ్యవహార శైలిపై రాయగడ బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్‌ను కలిసేందుకు వెళ్లిన ఒక న్యాయవాదితో ఆమె దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్‌కు బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రజ సుందర్ నాయక్ నేతృత్వంలో న్యాయవాదులు అదనపు కలెక్టర్‌ను కలిసి తమ అభ్యంతరాలను వివరించారు. వినతిపత్రం స్వీకరించిన నవీన్ నాయక్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు బ్రజ సుందర్ నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీన న్యాయవాది టి.నాగరాజు ఒక కేసుకు సంబంధించిన అంశంపై తహసీల్దార్‌ను కలిసేందుకు ఆమె కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. అయితే తహసీల్దార్ ఆయనతో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటనను బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయవాదుల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది నాగరాజు మాట్లాడుతూ కోర్టు వ్యవహారాలకు సంబంఽధించిన సమాచారం కోసం సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడం న్యాయవాదుల విధుల్లో భాగమని చెప్పారు. అలాంటి సందర్భంలో తహసీల్దార్ తన చాంబర్ నుంచి బయటకు వెళ్లాలని, లేకపొతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం బాధకరమని పేర్కొన్నారు. తనతో పాటు వచ్చిన క్లయింట్ సమక్షంలో తహసీల్దార్ అనుచితంగా ప్రవర్తించడం విచారకరమని, ఇటువంటి ఘటనలపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు.


