కొరాపుట్: మనుషులపై దాడి చేస్తున్న ఎలుగు బంటిని అటవీ శాఖ బంధించింది. నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి కుసిమి గ్రామ సమీపంలో శ్మశానం వద్ద బబ్లున్ గౌడ (40) అనే వ్యక్తి పశువులు మేపడానికి తెచ్చాడు. ఇదే సమయంలో రెండు పిల్లలతో వచ్చిన ఎలుగుబంటి బబ్లున్‌పై దాడి చేసి చంపేసింది. దీంతో సమీప గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. వెంటనే అటవీ శాఖ ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. గాలింపులు చర్యలు చేపట్టి ఎలుగుబంటిని గుర్తించింది. వెంటనే మత్తు ఇంజక్షన్‌ని దూరం నుంచి ఎలుగు బంటిపై కొట్టారు. కొద్దిసేపటికి ఎలుగు ఆ ప్రాంతంలో మత్తులో తూలుతూ వెళ్లింది. వెంటనే అటవీ సిబ్బంది కాగడాలు, వలలతో వెళ్లి ఎలుగుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక బోనులో పెట్టి అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఎలుగుకి చికిత్స అందజేసి అటవీ ప్రాంతంలో విడిచి పెడతామని ప్రకటించారు. మరోవైపు ఎలుగుతో వచ్చిన రెండు పిల్లలు ఎక్కడున్నాయోనని పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోలనలు గురవుతున్నారు. వాటి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.


