జయపురం: అయోధ్య రామ మందిరంలో విరాళాలు చోరీ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ భవనంలో కాంగ్రెస్ నాయకులు గురువారం మాట్లాడుతూ.. విరాళాల చోరీపై తక్షణమే ప్రధానమంత్రి లేదా ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, రాష్ట్ర విధాన సభలో విపక్ష నేత పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడమ్, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
జయపురం: స్థానిక క్రిస్టియన్‌పేట 26వ జాతీయ రహదారిలో బుధవారం రాత్రి ఒక వ్యాన్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తులను జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా కొన్ని గంటల సమయం 26వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్రమాద సమాచారం అందిన పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ నుంచి అతివేగంగా వస్తున్న వ్యాన్ రోడ్డుపక్కన నిలిపి ఉన్న బైక్‌లను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌న సీజ్‌చేసి పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో కర్రతో దాడి.. వ్యక్తి మృతి
కుత్బుల్లాపూర్: తాగిన మైకంలో గొడవ పడి తలపై కర్రతో కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బేరి నరసింహులు గత 6 నెలలుగా కొంపల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కింద ఉంటూ అడ్డా కూలీగా పని చేస్తున్నాడు. ఇతనితో పాటు కన్నా అనే వ్యక్తి కూడా ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒకే చోట నిద్రపోతూ.. ఉద యం కూలి పనులకు వెళ్లి వచ్చేవారు. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. నరసింహులు తలపై, కాళ్ల పైన కర్రతో కన్నా కొట్టి తీవ్రంగా గాయపరచడంతో అతడు కింద పడిపోయాడు. అతని పక్కనే తాగిన మైకంలో ఉన్న కన్నా సైతం నిద్రపోయి తెల్లవారుజామున పరారయ్యాడని పోలీ సులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన నరసింహులు అని తేలింది.


