భూసేకరణ ప్రక్రియ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ ప్రక్రియ ప్రారంభం

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

రాయగడ: జిల్లాలో జాతీయ రహదారి–326 విస్తరణ పనులకు కీలక అడుగు పడింది. ముకుందపూర్‌ హటొపడ నుంచి కై లాస్‌పూర్‌ ఎస్‌ఎస్‌డీ ఉన్నత పాఠశాల వరకు రహదారి విస్తరణ కోసం భూముల గుర్తింపు, సర్వే ప్రక్రియను జాతీయ రహదారుల అధికారులు, రెవెన్యూ శాఖ సర్వే బృందం సంయుక్తంగా బుధవారం ప్రారంభించారు. ఈ పరిణామంతో స్థానికుల్లో అభివృద్ధిపై ఆశలు పెరుగుతుండగా.. భూసేకరణ, నష్ట పరిహారంపై భూ యజమానుల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సర్వేలో భాగంగా ఖాతా నంబర్లు, ప్లాట్‌ నంబర్లు, భూమి రకం, యజమానుల వివరాలు, సేకరించాల్సిన భూమి విస్తీర్ణాన్ని నమోదు చేస్తున్నారు. అలాగే రహదారి వెంట ఉన్న ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర శాశ్వత నిర్మాణాల వివరాలను కూడా సేకరిస్తున్నారు. సర్వే పనులకు స్థానికులు సహకరించాలని కోరారు. రహదారి విస్తరణ పూర్తయితే పెరుగుతున్న వాహన రద్దీకి ఉపశమనం లభించడంతో పాటు.. ప్రమాదాలు తగ్గి అత్యవసర సేవలు, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారమే భూసేకరణ చేపడతామని, ప్రభావిత భూ యజమానులకు చట్టం ప్రకారం తగిన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. సర్వే పూర్తయిన అనంతరం తుది భూసేకరణ జాబితాను ప్రకటించి, తదుపరి దశలో జాతీయ రహదారి –326 విస్తరణ పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement