జయపురం: జయపురంలో మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణ పోలీసులు జయపురం మున్సిపాలిటీ పరిధి జయనగర్ భూతనాథ్ మందిర ప్రాంతంలో బ్రౌన్ షుగర్ పొట్లాలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో రామ ఛత్రియ, లలన్ కుమార్ సామంతరాయ్‌లు ఉన్నట్లు వెల్లడించారు. వారి నుంచి 5.140 మిల్లీ గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి 9.45 గంటల సమయంలో ఏఎస్‌ఐ గోవింద హసద పోలీసులతో పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు భూత మందిరం వద్ద బ్రౌన్ షుగర్ అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టారు. ఆ సమయంలో ఒక స్కూటీ వద్ద నిల్చున్న ఇద్దరు వ్యక్తులను చూసి వారిని విచారించారు. వారిని శోధించగా ఒక కాగితంలో బ్రౌన్ షుగర్ కనుగున్నారు. స్కూటీతో వచ్చి అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. వారి నుంచి రూ.800ల నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.


