భువనేశ్వర్: ఈ ఏడాది జరగనున్న ప్రసిద్ధ పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర ప్రత్యక్షంగా తిలకించేందుకు రావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకులు డాక్టరు అరవింద కుమార్ పాఢి ప్రత్యేకగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహాప్రభు ఘోష యాత్రను క్రమబద్ధంగా, సజావుగా నిర్వహించేందుకు సేవా ప్రదాతలతో మంచి సమన్వయం పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు.
అక్రమంగా తరలిస్తున్న
కలప పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి అటవీ శాఖ సిబ్బంది సోమవారం రాత్రి పేట్రోలింగ్ నిర్వహిస్తుండగా కలపను అక్రమంగా తరలిస్తున్న ముఠా పట్టుబడింది. పెట్రోలింగ్ సిబ్బంది అతివేగంగా వస్తున్న ఓ పికాప్ వ్యాన్ ఆపి తనిఖీ చేయగా కలప తరలిస్తున్న విషయం వెలుగు చూసింది. కోరుకొండ ప్రాంతం నుంచి ఆంధ్రాలోని డంకరాయి ప్రాంత్రానికి అక్రమంగా కలపను తరలిస్తున్నట్టు అటవీ సిబ్బంది గుర్తించి వ్యాన్‌లో ఉన్న పది టేకు దుంగలను స్వాధీనం చేసుకోవడంతోపాటు వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు.
క్రికెట్ టోర్నమెంట్ విజేతగా మలాలిగుడ జట్టు
జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడలో నిర్వహిస్తున్న భాయిభాయి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 16 టీములు పాల్గొన్నాయి. వీటిలో మల్కన్‌గిరి జిల్లా మలాలిగుడ టైజర్ లెవెన్ టీమ్, బొయిపరిగుడ నిరో లెవెన్ టీమ్‌లు ఫైనల్‌కు చేరాయి. ఫైనల్‌లో మలాలిగుడ టైజర్ లెవెన్ బొయిపరిగుడ టీమ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. బహుమతుల ప్రధాన ఉత్సవంలో కొరాపుట్ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళికా బోర్డు అధ్యక్షుడు రఘురాం మచ్చ, నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి హరి ప్రధాని, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి జోగా బిశాయి, త్రిలోచన జెన, కిరణ్ స్వైయ్, మనోజ్ నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య పనులు
రాయగడ: పవిత్ర రథయాత్ర పురస్కరించుకొని స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో విస్తృత స్థాయిలో స్వచ్ఛతపై అవగాహన, పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్ నేతృత్వంలో సఫాయి అప్నావో.. భీమరీ భగావో నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్య నిర్వాహక అధికారి కుల్దీప్ కుమార్ మాట్లాడుతూ.. రాయగడ నగరాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు. నగర పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అనంతరం రాయగడ మున్సిపాలిటీ తరుపున జిల్లా ప్రజలకు పవిత్ర రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేశారు.


