కొరాపుట్: కటాఫ్ గ్రామంలో సమస్యలు తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు పడవ ప్రయాణం చేశారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి బిలాపుట్ గ్రామ పంచాయతీ జోలాపుట్ రిజర్వాయర్‌లో ఉన్న సబున్ గ్రామానికి అధికారులు తరలివెళ్లారు. జన జీవన స్రవంతికి దూరంగా ఉన్న ఈ గ్రామం గతంలో గంజాయి పంటకు పేరు గాంచింది. అయితే ఈ గ్రామం కోసం విన్న కలెక్టర్ సత్యవాన్ మహాజన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, జిల్లా ముఖ్య పశువైద్యాధికారి వేణుధర్ సబర్, ఐటీడీఏ పీవో స్నేహప్రభ మజ్జి తదితర అధికారులతో కలిసి పడవ మీద ఈ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఘాట్ నుంచి గ్రామానికి రోడ్డు నిర్మాణం, అదే ప్రాంతంలో ఉన్న సబున్–లమాదర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం, విద్యుత్ కనెక్షన్, ఈ ప్రాంతంలో ఉన్న కటాఫ్ గ్రామాలకు ప్రాథమిక విద్య సౌకర్యం తదితర సమస్యలు గ్రామస్తులు విన్నవించారు. దీంతో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కలెక్టర్ ప్రకటించారు. కటాఫ్ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. దీంతో ఈ గ్రామానికి ఇంతవరకు ఏ కలెక్టర్ కూడా ఇలా రాలేదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


