ధారాసింగ్‌ విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

ధారాసింగ్‌ విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశం

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

ధారాసింగ్‌ విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశం

భువనేశ్వర్‌: 1999లో ఆస్ట్రేలియన్‌ మిషనరీ గ్రాహం స్టెయిన్స్‌, అతని ఇద్దరు మైనర్‌ కుమారుల హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ధారా సింగ్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా ఈ ఆదేశాలు అమలు జేయాలని ఒడిశా ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ అయినట్లు అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ తెలిపారు.

ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ధారా సింగ్‌ను విడుదల చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు. యావజ్జీవ ఖైదీ ధారా సింగ్‌ అసలు పేరు రవీంద్ర కుమార్‌ పాల్‌. గ్రాహం స్టెయిన్స్‌, అతని కుమారులు ఫిలిప్‌, తిమోతిల హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతని శిక్షా కాలం తగ్గింపు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు గతంలో ఒడిశా ప్రభుత్వానికి ఆదేశించింది. రాష్ట్ర శిక్షా సమీక్షా బోర్డు (ఎస్‌ఎస్‌ఆర్‌బీ) ఈ ఏడాది జూలై 6న సమావేశమై ధారా సింగ్‌తో సహా 56 మంది జీవిత ఖైదీల శిక్షా కాలం తగ్గింపు దరఖాస్తులను పరిశీలించి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

తాను 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించినందున మరింత ఉదారమైన శిక్షా తగ్గింపు విధానం ప్రయోజనం కల్పించాలని కోరుతూ ధారా సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2025 సంవత్సరం ఏప్రిల్‌ నెలలో ఈ కేసులో సహ–దోషి, దారా సింగ్‌ సహచరుడైన మహేంద్ర హెంబ్రమ్‌ను మంచి ప్రవర్తన ఆధారంగా జైలు నుండి ముందస్తు విడుదల మంజూరు చేశారు.

ఈ హత్యలు 1999 జనవరి 21వ తేదీ రాత్రి ఒడిశాలోని కియోంఝర్‌ జిల్లా మనోహర్‌పూర్‌ గ్రామంలో జరిగాయి. గ్రాహం స్టెయిన్స్‌, అతని ఇద్దరు కుమారులు ఒక క్రైస్తవ సమావేశానికి హాజరైన తర్వాత వారి స్టేషన్‌ వ్యాగన్‌లో నిద్రిస్తుండగా ధారా సింగ్‌ నాయకత్వంలో ఉన్నారని ఆరోపించిన ఒక గుంపు ఆ వాహనానికి నిప్పు అంటించింది. దీంతో ముగ్గురూ ఘటనా స్థలంలో సజీవ దహనం అయ్యారు.

ప్రస్తుతం ఒడిశా పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్న అప్పటి మయూర్‌భంజ్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా 2000వ సంవత్సరం జనవరి 31న దారా సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో దారా సింగ్‌, మహేంద్ర హెంబ్రమ్‌తో సహా 14 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. వారిలో 12 మంది తదనంతరం నిర్దోషులుగా విడుదలయ్యారు. ముగ్గురి హత్య కేసులో ధారా సింగ్‌ను ప్రధాన కుట్రదారుడిగా పేర్కొంటూ 2003లో సీబీఐ కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. 2005లో ఒడిశా హై కోర్టు ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చగా 2011 సంవత్సరంలో సుప్రీం కోర్టు ఆ యావజ్జీవ కారాగార శిక్షను సమర్థించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement