జయపురం: పెన్షన్ డబ్బుల కోసం బ్యాంక్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి టంగినిగుడ గ్రామ సమీప డాల్‌ఖాయి మార్గంలో చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తి బొయిపరిగుడ సమితి దసమంతపూర్ గ్రామ పంచాయతీ పకుల్‌పడ గ్రామానికి చెందిన దొశెయి ఖొర(75)గా పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం దొశెయి ఖొర తన పెన్షన్ డబ్బులు బ్యాంకు నుండి తీసుకునేందుకు టంగిణిగుడలోని బ్యాంకుకు వెళ్లాడు. డబ్బులు తీసుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో టంగిణిగుడ గ్రామ సమీప డాల్‌ఖాయి మార్గంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. వెంటనే స్థానికులు అంబులెన్స్ సాయంతో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రి జయపురం తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


