సరిహద్దులో కోవిడ్‌ జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులో కోవిడ్‌ జాగ్రత్తలు

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

ఆంధ్రాలో కేసులతో ఒడిశాలో అప్రమత్తత

భువనేశ్వర్‌: పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో కోవిడ్‌ సంబంధిత రెండు మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒడిశా తన సరిహద్దు జిల్లాల్లో కోవిడ్‌ 19 నిఘాను ముమ్మరం చేసింది. వార్షిక రథ యాత్రకు ముందు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆంధ్ర ప్రదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఒడిశాలోని అన్ని జిల్లాల ముఖ్య జిల్లా వైద్య అధికారులకు (సీడీఎంఓ) సూచనలు జారీ చేసినట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ రవీంద్ర నాథ్‌ మిశ్రా సోమ వారం తెలిపారు. నిఘాను ముమ్మరం చేసి కోవిడ్‌ 19 అనుమానిత కేసులన్నింటికీ జిల్లా కేంద్ర ఆస్పత్రులలో పరీక్షలు జరిగేలా చూడాలని వారిని కోరారు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం కేసులు తగ్గినప్పటికీ ఒడిశా నిరంతర కోవిడ్‌ 19 నిఘాను కొనసాగిస్తోంది. అనుమానిత రోగులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.రాష్ట్రంలోనే అతి పెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటైన పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు పూరీని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ 19 పట్ల నిఘా ప్రాముఖ్యత సంతరించుకుంది. యాత్ర సమయంలో ఎవరికై నా కోవిడ్‌ వంటి లక్షణాలు కనిపిస్తే వారికి పరీక్షలు నిర్వహించి అందుబాటులో ఉన్న కోవిడ్‌ 19 చికిత్సా విధానాలకు అనుగుణంగా పటిష్టమైన చికిత్స అందించాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలన్నిటినీ అప్రమత్తంగా ఉంచాలని ఆయా జిల్లాల ముఖ్య జిల్లా వైద్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ 19 వ్యాప్తి కట్టడి తప్పనిసరి నివారణ కార్యాచరణ కావడంతో ప్రజలు అనవసర సామాజిక సమావేశాలకు దూరంగా ఉంటు అవసరమైనప్పుడు మాస్కులు ధరించి తరచుగా చేతులు కడుక్కోవాలని సూచించారు. జ్వరం, దగ్గు, నీరసం వంటి లక్షణాలు ఉన్నవారు లేదా కోవిడ్‌ 19 అనుమానిత రోగితో సన్నిహితంగా మెలిగిన వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలి. వారు సూచించిన చికిత్సా విధానాలు మరియు ఆరోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి అని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర నాథ్‌ మిశ్రా అన్నారు. ఈ చర్యలు కేవలం ముందు జాగ్రత్త కోసమే. యాత్ర సీజన్‌లో ప్రజల భద్రతను నిర్ధారించడమే వీటి లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అవాంఛిత భయాందోళనకు గురి కావద్దని కోరారు. సరిహద్దు ప్రాంతాలు లేదా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి నివేదించబడిన ఏవైనా అనుమానిత కేసులపై అప్రమత్తంగా ఉంటూ తక్షణమే స్పందించాలని ఆరోగ్య శాఖ స్థానిక అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం మారుతున్న పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తగిన వైద్య మౌలిక సదుపాయాలు, పరీక్షా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement