కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో గతంలో ఐటీడీఏ ఈఈగా పనిచేసిన సంజయ్ కుమార్ కసిపట్టా ఆస్తుల లక్ష్యంగా విజిలెన్స్ విభాగం దాడులు చేసింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 7 చోట్ల ఈ దాడులు జరిగాయి. సంజయ్ ప్రస్తుతం ఓసీసీ లిమిటెడ్, భువనేశ్వర్‌లో ఈఈగా పనిచేస్తున్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో సొంత నివాసం, పట్టణంలో నాలుగంతస్తుల భవనం, కుంబా–2 నిర్మితం అవుతున్న భవనం, సుందర్‌గఢ్‌లో తల్లితండ్రుల నివాసం, సుందర్‌గఢ్‌లో నిర్మితం అవుతున్న మరో భవనం, భువనేశ్వర్, బలంగీర్ లలో ప్రభుత్వ నివాస గృహాల్లో దాడులు జరిగాయి. జయపూర్ విజిలెన్స్ కోర్టు ప్రత్యేక అనుమతి తో ఆరుగురు డీఎస్పీలు, 8 మంది ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు ఏఎస్‌ఐలు ఈ దాడుల్ల పాల్గొన్నారు. ఈ దాడుల్లో 23 గదుల మరో భవనం, 8 అత్యధిక విలువ గల జాగాలు, ఒక నాలుగు చక్రాల వాహనం గుర్తించారు. 2011 లో కేవలం రూ..9,300 జీతానికి కొరాపుట్ జిల్లా నారాయణపట్న లో ప్రభుత్వ విధులలో చేరిన సంజయ్ కోట్లాది రూపాయల అక్రమార్జన విజిలెన్స్ అధికారులను నివ్వెర పరిచింది.ఈ దాడులు ఇంకా కొనసాగిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు ప్రకటించారు.


