రాయగడ: వరదలు, చెరువులు, నదుల్లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగే ఘటనలను తగ్గించి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం, జిల్లా అత్యవసర విభాగం, ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన స్విమ్మింగ్ అండ్ డ్రౌనింగ్ సర్వైవల్ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది మొత్తం 10 బ్యాచ్‌లలో 300 మంది యువతకు ఈతతోపాటు ప్రాణరక్షణ నైపుణ్యాల్లో శిక్షణ అందించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో చివరి బ్యాచ్‌కు చెందిన 30 మంది శిక్షణార్థులకు ప్రశంసించారు. గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి దశలో మూడు బ్యాచ్‌లు నిర్వహించారు. ఈ ఏడాది మే 11 నుంచి మరో ఏడు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. దీంతో మొత్తం 10 బ్యాచ్‌లలో 300 మంది యువకులు, యువతులు శిక్షణ పొందారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఐదు బ్యాచ్‌లను బాలురుకు, మరో 5 బ్యాచ్‌లను బాలికలకు ప్రత్యేకంగా నిర్వహించారు. శిక్షణలో ప్రాథమిక ఈత నైపుణ్యాలు, సీపీఆర్ విధానం, నీటి ప్రవాహం, పరిస్థితులను అంచనా వేయడం, స్థానికంగా అభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నీటిలో మునిగే వారిని సురక్షితంగా రక్షించే పద్ధతులపై ప్రాయోగిక శిక్షణ అందించారు.


