భువనేశ్వర్: స్నానోత్సవం సందర్భంగా 108 కలశాల సుగంధ జలాలతో స్నానం చేసి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు సోదర, సోదరి సమేతంగా ఏకాంత గృహంలో గోప్య సేవలు పొందుతున్నాడు. కోట్లాది భక్త జనుల ఆరాధ్య దైవమైన శ్రీ జగన్నాథుడు సోదర సోదరీ సమేతంగా త్వరగా కోలుకోవాలని వివిధ ఉపచారాలతో స్వామికి సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురై చీకటి గదిలో స్వామి గత 12 రోజులుగా రాజ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీ మందిరంలో సంప్రదాయం ప్రకారం ద్వాదశి నాడు దశ మూలికల మోదకాలను స్వామికి చికిత్సలో భాగంగా సమర్పించాలని రాజ వైద్య వర్గం నిర్ణయించింది.
ఆయుర్వేద పద్ధతులు
స్వామి వారికి స్వస్థత చేకూర్చేందుకు రాజ వైద్యులు ఆయుర్వేద పద్ధతులు, శాస్త్రాల ప్రకారం దశమూలికల మోదకాలను తయారు చేశారు. వంశపారంపర్యంగా తరతరాలుగా శ్రీ మందిరంలో రాజ వైద్యులు మహా ప్రభువుకు సేవలు కొనసాగిస్తున్నారు. ఈ మహా ఔషధి తయారీ కోసం ముందుగా శాలపర్ణి, గుమ్మడి టేకు, నాగదమని, కృష్ణ పర్ణి, అగరు, మారేడు, గోక్షురం, లవంగం వంటి అటవీ ఉత్పత్తులను సేకరించి బాగా ఎండబెడతారు. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి దంచి పొడి చేస్తారు. ఆ పొడిని గుడ్డలో జల్లెడ పడతారు. ఇలా సిద్ధం చేసిన చూర్ణంను కోవా, పంచదార, పాల మీగడ, తేనె, నెయ్యి, భంగు మొదలైన వాటి మిశ్రమంతో తయారు చేసిన పాకంలో కలిపి ముద్దగా తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో కొత్త కట్టెల పొయ్యిని వినియోగిస్తారు. పాకం బట్టిన ముద్దని అరటి ఆకులపై పరచి చల్లారిన తర్వాత గుండ్రని మోదకాలుగా చేసి 3 కుండలలో ఉంచుతారు.దానిపై కర్పూరం చల్లి, చింత ఆకులతో కప్పి ఆలయానికి సమర్పిస్తారు. ఇందుకు అవసరమైన దశ మూలికల మోదకాలను ఒక రోజు ముందుగా ఖొల్లిలగ్గి ఏకాదశి నాడు శ్రీ మందిరానికి తరలించారు. ఈ ఆచారం ఖొల్లి లగ్గి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ద్వాదశి నుంచి శ్రీ జగన్నాథుని చికిత్సలో ఈ మూలికల్ని సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది.


