కొరాపుట్: దర్జాగా కారులో వచ్చి ఆయుధాలు చూపించి దోపిడీ చేసిన ఘటన నబరంగ్‌ఫూర్ జిల్లా జొరిగాం సమితి బనగుడ గ్రామంలో జరిగింది. గ్రామంలోని లక్ష్మణ్ ఠాకూర్ ఇంటికి అర్ధరాత్రి ఆయుధాలతో నలుగురు వ్యక్తులు వచ్చారు. తలుపులు విరగ్గొట్టి ఇంటిలో చొరబడ్డారు. లక్ష్మణ్‌కి తుపాకీ చూపించి బీరువా తాళాలు తీసుకున్నారు. ఇంటిలో ఉన్న రూ.15 లక్షలు విలువ గల బంగారం, నగదు పట్టుకునిపోయారు. మహిళల ముక్కు, చెవిలో ఉన్న బంగారం పట్టుకుపోయారు. పురుషులు ధరించిన ప్యాంట్లు, షర్టుల లోని డబ్బులు కూడా తీసుకెళ్లిపోయారు. దోపిడీ సమయంలో ఇంటి సభ్యులందరినీ ఒకే చోట కూర్చోబెట్టారు. దొంగలు హిందీ, బెంగాళీ భాషల్లో మాట్లాడుకున్నారని బాధితులు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ పార్ధవ్ కశ్యప్ బాధితుల ఇంటికి చేరుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.రాష్ట్ర సరిహద్దులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


