‘ఉపా’ కేసును ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపా’ కేసును ఉపసంహరించుకోవాలి

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): యూట్యూబర్‌ ‘ప్రశ్న రావణ్‌’పై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ‘ఉపా’ చట్టం కింద నమోదు చేసిన కేసును తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురం అంబేడ్కర్‌ విజ్ఞాన మందిర్‌లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ ఉపా చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే ఒక నల్ల చట్టమని, దీన్ని ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా ప్రయోగించడం సరైంది కాదన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాధరావు మాట్లాడుతూ నేరం చేయని వారిపై కూడా ఈ దారుణమైన చట్టాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగుల వల్ల చేయని నేరానికి ఏళ్ల తరబడి జైల్లో మగ్గాల్సి వస్తోందని చెప్పారు.

ప్రశ్న రావణ్‌పై పెట్టిన కేసు భవిష్యత్తులో ప్రశ్నించే గొంతులను భయపెట్టడానికి, సామాజిక మాధ్యమాలను అదుపు చేయడానికి ప్రభుత్వం వేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్రి దానేష్‌, జిల్లా దళిత జేఏసీ కన్వీనర్‌ డి.గణేష్‌, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్‌, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటరావు, డి.టి.ఎఫ్‌. పూర్వ జిల్లా అధ్యక్షుడు కోత ధర్మారావు, ఆదివాసీ సంక్షేమ సంఘం ప్రతినిధి శాంతారావు, బీటీఏ నాయకుడు శ్రీనివాసరావు, జె.వి.వి. చిన్నారావు, రెల్లి సంక్షేమ సంఘం నేత అర్జి కోటి, రైతు కూలీ సంఘం నాయకుడు బి.కూర్మారావు, బుడుమూరు వెంకటరమణ, అంబేడ్కర్‌ చైర్‌ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ టి.రమణ, పైడి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నిమ్మల అనంతరావు, రాకోటి చిన్నికృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.

రావిచెట్టు పడి మూడు ఇళ్లు ధ్వంసం

● నాలుగు విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో

నిలిచిన విద్యుత్‌ సరఫరా

నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట పరిధిలోని ఆదివరపుపేటలో శనివారం రావిచెట్టు కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్‌ వైర్లపై పడటంతో నాలుగు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. బోయిన జనార్దనరావు, తంగుడు ఆంజనేయులు, తంగుడు కృష్ణ, సుబుద్ధిల ఇళ్లపై చెట్టుకొమ్మలు పడటంతో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు. పంచాయతీ, విద్యుత్‌ సిబ్బంది స్పందించి చెట్లు కొమ్మలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు.

ఐటీఐ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఎచ్చెర్ల : ఐటీఐలలో ప్రవేశాలకు సంబంధించి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో శనివారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. మొదటి రోజు 584 మందిని పిలవగా 255 మంది హాజరయ్యారు. వీరిలో 141 మందికి సీట్లు కేటాయించారు. ఆదివారం కూడా కౌన్సెలింగ్‌ కొనసాగించనున్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకర్‌, చిట్టి నాగభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

టెక్కలి సీఐపై తప్పుడు వీడియో పోస్టింగులు

పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న

తరుణ్‌కుమార్‌పై రౌడీషీట్‌

టెక్కలి: పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న టెక్కలి కోదండ రామవీధికి చెందిన కొమ్ము తరుణ్‌కుమార్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో పోస్టింగులు పెట్టాడని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తరుణ్‌కుమార్‌ గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉండటమే కాకుండా రిమాండ్‌కు కూడా వెళ్లాడని చెప్పారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉంటూ వ్యసనాలకు బానిసగా మారి పలు మోసాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. మోసాలు బట్టబయలు కావడంతో తదుపరి నేరాలు చేసే అవకాశం ఉండదని భావిస్తూ సీఐ విజయ్‌కుమార్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు వీడియో పోస్టింగ్‌లు చేశాడని పేర్కొన్నారు. చట్ట విరుద్దమైన నేరాలు, చట్ట వ్యతిరేక పనులు చేస్తుండటంపై టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో తరుణ్‌కుమార్‌పై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ విజయ్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement