జయపురం: క్రీడలు శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతాయని ముఖ్యఅతిథిగా హాజరైన కొరాపుట్ రీజనల్ చీఫ్ కంజెర్వేటింగ్ ఆఫ్ ఫారెస్టర్ యజ్ఞదత్ పాడి అన్నారు. శనివారం జయపురం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో అవిభక్త కొరాపుట్ జిల్లాల ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నాలుగు జిల్లాల ఫారెస్టు ఉద్యోగుల మధ్య ఫుట్‌బాల్ ప్రీమియం లీగ్ పోటీలను ప్రారంభించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని ఫారెస్టు ఉద్యోగుల మధ్య క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఫుట్‌బాల్ ప్రీమియం పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లభించకపోయినా అటవీ విభాగాల ఉద్యోగులు తమ సొంత డబ్బులను చందాలు వేసుకొని నిర్వహించటం అటవీ విభాగం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల్లో కనిపిస్తున్న ఉత్సాహం తనను అబ్బురపరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జయపురం అటవీ డివిజన్ డీఎఫ్‌ఓ ప్రశాంత్ పటేల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో కొరాపుట్, రాయగడ, నవరంగపూర్, మల్కనగిరి జిల్లాల్లో వివిధ రేంజ్‌ల నుంచి 8 టీమ్‌లు పూల్గొన్నాయని వెల్లడించారు. ఈ పోటీల్లో రేంజర్ సచీంద్ర పొరిడ, సందీప్ పాణిగ్రహి, దేవేంద్ర మఝి, గొవింద నాయక్, మానస రంజన్ నాయక్, ఛబి రొంధారి తదితరులు ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవంలో అతిథిలుగా జయపురం డీఎఫ్‌ఓతోపాటు డీఎఫ్‌ఓలు ఉదయన్ సుబుద్ధి, సిద్ధాంత జైన్, సచిన్ ఓయల్, సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


