న్యూస్‌రీల్
శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026
భువనేశ్వర్: పూరీలో జరగనున్న శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర దగ్గర పడుతుంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శుక్ర వారం లోక్ సేవా భవన్‌లో రథ యాత్ర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ బృహత్తర యాత్ర నిర్వహణలో సమన్వయం, పటిష్టమైన ఏర్పాట్లుపై దష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ యాత్ర సజావుగా జరిగేందుకు వివిధ శాఖల మధ్య నిరంతర సంప్రదింపులు, సహకారం అవసరమన్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చే యాత్రికుల రద్దీ నియంత్రణ పటిష్టంగా నిర్వహించేందుకు ప్రతి స్థాయిలో సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం, సమర్థవంతంగా సమాచారాన్ని పంచుకోవడం చాలా కీలకమని అన్నారు.
సమయపాలన, జన సమూహ నిర్వహణ, అగ్ని భద్రత, భక్తులు, రథాల భద్రత యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన అధికారులు ఈ ఉత్సవాన్ని విజయవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని కోరారు. భద్రతా విధుల కోసం ఒడిశా పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి సుమారు 12,000 మంది సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్, భారత నౌకా దళాన్ని కూడా అప్రమత్తం చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
మెరుగైన సమాచార ప్రసారం, పర్యవేక్షణ కోసం, పూరీ అంతటా 473 సీసీ టీవీ కెమెరాలు, 65 పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఒడియా, హిందీ, ఆంగ్ల భాషలలో సమాచారం అందిస్తారు. బల్క్ మెసేజింగ్ సేవలతో పాటు, పదహారు శాశ్వత, అనేక తాత్కాలిక మొబైల్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు. గుండిచా ఆలయంలో దివ్యాంగులు, వృద్ధ భక్తుల దర్శనాన్ని సులభతరం చేయడానికి సహాయ కేంద్రాలతో సహా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, సమన్వయం చేయడానికి ఒక సమీకత కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవం కోసం 1,700 బయో టాయిలెట్లను ఏర్పాటు చేసి పరిశుభ్రతను నిర్ధారించడానికి ప్రతి 5 టాయిలెట్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తారు. తక్షణ వైద్య సహాయం అందించడానికి 8 తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. రథయాత్ర సందర్భంగా పూరీకి 300కు పైగా రైళ్లు నడవనున్న నేపథ్యంలో, ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించాలని, రద్దీని సమర్థంగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
సమావేశానికి పనులు, న్యాయ మరియు అబ్కారీ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్, అభివృద్ధి కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్, హోం, సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, అగ్ని మాపక సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర సుధాంశు షడంగి, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాస్వత్ మిశ్రా, శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద కుమార్ పాఢి, వివిధ శాఖల కార్యదర్శులు, సీనియర్ పోలీసు అధికారులు, పూరీ జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు.
రథయాత్ర
సన్నద్ధతపై
పూరీ వ్యాప్తంగా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు
12,000 మంది భద్రతా సిబ్బంది మోహరింపు
300కు పైగా ప్రత్యేక రైళ్లు


