భక్తులతో పెనవేసుకున్న బంధం | - | Sakshi
Sakshi News home page

భక్తులతో పెనవేసుకున్న బంధం

Jul 11 2026 1:12 AM | Updated on Jul 11 2026 1:12 AM

భువనేశ్వర్‌: భక్త జన హదయాల్లో కొలువైన స్వామి శ్రీ జగన్నాథుడు. వార్షిక యాత్రలో అడుగడుగునా భక్త జనుల భక్తి శ్రద్ధలు పెనవేసుకుని ఉంటాయి. ఇంధన, సాంకేతిక, యాంత్రిక మద్దతు లేకుండా నింగిని తాకే నిలువెత్తు భారీ రథాలు వడివడిగా ముందుకు సాగడం అందుకు తార్కాణంగా నిలుస్తుంది. రథాలు లాగేందుకు బలాన్ని ఇచ్చే కొబ్బరి పీచు తాళ్ల తయారీ వెనుక ఆధ్యాత్మిక భావన, అంకిత భావంతో చిత్త శుద్ధిగా సేవలు అందించే అదృశ్య హస్తాలు ఎన్నో శ్రమిస్తాయి.

ఈ ప్రక్రియ యాత్రకు దాదాపు 6 నెలల ముందుగానే మొదలు అవుతుంది. ఒడిశా వ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు స్వహస్తాలతో పలుచని కొబ్బరి తాడులను తయారు చేస్తాయి. ఆ తర్వాత వాటిని ఒడిశా కోఆపరేటివ్‌ కాయిర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓసీసీసీ)కు పంపిస్తారు. పూరీలోని వీరప్రతాప్‌ పూర్‌ ఫ్యాక్టరీలో భారీ తాడులుగా నేస్తారు. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాటిని తయారు చేసి సకాలంలో అందజేస్తారు.

శాకాహారంతో సేవలు

మహిళా స్వయం సహాయక బందాలు, ఓసీసీసీ కార్మికులు రథాల తాళ్ల తయారీ స్వామి సేవగా భావిస్తారు. తాడులు తయారు చేసే ప్రక్రియ ఆద్యంతాలు వారు మహా ప్రభువు పట్ల భక్తికి చిహ్నంగా ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా కఠినమైన శాకాహారాన్ని పాటిస్తారు. ఓసీసీసీ ఒడిశా వ్యాప్తంగా ఉన్న జగన్నాథ ఆలయాలకు కొబ్బరి తాడులను సరఫరా చేస్తుంది. రథాలను లాగే ఈ సాంప్రదాయ కొబ్బరి పీచు తాళ్లు మహా ప్రభువుకు, లక్షలాది భక్తులకు మధ్య ఉన్న భక్తి పూర్వక బంధానికి ప్రతీకగా నిలుస్తాయి. జన సంద్రంలో రథాల కదలికకు దోహదపడే తాళ్లు తాకిన సాక్షాత్తు భగవంతుని ఆలింగనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందిన తన్మయంతో మనసారా ఉప్పొంగి పోతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement