భువనేశ్వర్: జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని భారీగా స్నానం ఆచరించిన శ్రీ జగన్నాథ స్వామి అస్వస్థతతో తెరమరుగు అయ్యాడు. కనులారా స్వామిని దర్శించుకోవాలని భక్త జన వర్గం ఆరాట పడుతోంది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో తెర చాటున నిశ్శబ్ద వాతావరణంలో దేవతా మూర్తులు గోప్యంగా వైద్య సేవలు, ఉపచారాలు పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రియతమ దైవం శ్రీ జగన్నాథ స్వామి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భక్త జనం రాజ వైద్యుల సూచన మేరకు ఫలాహారం సమర్పించేందుకు నడుం బిగించారు. భారీ కావళ్లతో వివిధ రకాల పండ్లు శ్రీ మందిరానికి చేర్చడంలో తలమునకలై ఉన్నారు. కటక్ జిల్లా నియాలి ప్రాంతం మాధవానంద ఆలయం నుంచి శ్రీ క్షేత్రానికి పండ్ల (ఫలాహారం) కావళ్లు భుజాన వేసుకుని బయలుదేరారు. కావడిలో వివిధ రకాల పండ్లు, మూలికలు, తులసి దళం, సుగంధ పువ్వులు రవాణా చేశారు. సంకీర్తనాలాపనతో ఊరేగింపుగా బయల్దేరారు. స్వామి కోసం తరలించే పండ్ల కావడిని ఒణొసొరొ భారొగా వ్యవహరిస్తారు.


