రాయగడ: రాయగడ రైల్వే డివిజన్‌గా ఎదుగుతున్న వేళ స్థానిక రైల్వేస్టేషన్ సూచిక బోర్డులో తెలుగు భాషను తొలగించడం వివాదాస్పదంగా మారింది. దశాబ్ధాలుగా సూచిక బోర్డుపై ఉన్నటువంటి తెలుగును ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం తెలుగు భాషాభిమానుల మనోభావాలను దెబ్బతీసిందని స్థానిక తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు తెలుగును యథావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వే డీఆర్‌ఎం పేరిట ఒక వినతిపత్రాన్ని ఏడీఈఎన్ రాజేంద్ర కుమార్‌కు శుక్రవారం సమర్పించారు. జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు నేతృత్వంలో స్థానిక కళింగ వైశ్య సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం, ఫ్రెండ్స్ ఎంజీఎఫ్ వాకర్స్ క్లబ్, స్వర్ణకారుల సంఘం తదితర తెలుగు సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా రాయగడ రైల్వేస్టేషన్ సూచిక బోర్డులో తెలుగు భాషకు స్థానం ఉన్నప్పటికీ.. ఇటీవల దానిని తొలగించడం సరికాదని ప్రతినిధుల బృందం పేర్కొంది. మజ్జిగౌరి మందిరానికి పొరుగున తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని, ఈ క్రమంలో ఈ సూచిక బోర్డు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు సంబంధించి అనౌన్స్‌మెంట్ కూడా తెలుగులో చెప్పాలని కోరారు. కార్యక్రమంలో కింతలి అమర్‌నాథ్, టంకాల జయరాం, బొచ్చ శ్రీనివాస్, చిన్నారి విజయ్ మోహన్, సీహెచ్ రాంబాబు, పొట్నూరు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


